వేట లేక.. పూట గడవక..

May 22,2024 22:09
వేట సాగక పూట గడవక

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

వేట సాగక పూట గడవక మత్య్సకారులు ఆకలితో అలమటించే పరిస్థితులు నెలకొన్నాయి. వేట నిషేధ సమయంలో ఏటా వీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సముద్రంలోకి వేటకు వెళితేనే నోట్లోకి ముద్ద వెళుతుందని, ప్రస్తుతం కుటుంబ పోషణ కష్టంగా మారిందని పలువురు ఆవేదన చెందుతున్నారు. అరకొర మందికి ఇచ్చే పరిహారంలోనూ ఆలస్యం చేస్తుండడం వల్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులు దాటుతున్నా పరిహారం పంపిణీ చేయని సర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం పరిహాసమాడుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఏప్రిల్‌ 14 అర్ధరాత్రి నుంచి జూన్‌ 14 అర్ధరాత్రి వరకూ 60 రోజులు వరకూ జిల్లాలో వేట నిషేధం అమల్లో ఉంది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్‌, కాకినాడ అర్బన్‌, తాళ్లరేవు, ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అల్లవరం, సఖినేటిపల్లి తదితర 13 మండలాల్లో 144 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది. కోస్తా తీర ప్రాంతం గుండా 3.55 లక్షల మంది నివసిస్తుండగా చేపల వేట ద్వారా సుమారు 70 వేల కుటుంబాలు ఉపాధిని పొందుతున్నాయి. సుమారు 600 మెకనైజ్డ్‌, 3 వేల పైబడి మోటరైజ్డ్‌ బోట్లపై మత్స్యకారులు చేపల వేటన సాగిస్తున్నారు. చేపలు గుడ్లు పెట్టే దశలో మర, మోటారు బోట్లతో వేటాడితే మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో ఏటా దేశవ్యాప్తంగా 60 రోజుల పాటు వేట నిషేధం అమల్లో ఉంటుంది. వీరిలో సుమారు 25 వేల కుటుంబాలకు మాత్రమే ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి గతేడాది మాదిరిగానే రూ.10 వేల పరిహారం వారి వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రూ.25 కోట్లు బడ్జెట్‌ కేటాయించినట్టు అధికారులు తెలిపారు. ఏటా ఆలస్యమే వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన పరిహారం విషయంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలు గడిచిన తర్వాత కూడా పరిహారం ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పుడు నెల రోజులు దాటినా ఒక్క రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఈ పరిహారం ఎప్పటికి ఇస్తారో అధికారులే చెప్పలేకపోవడం గమనార్హం.మరోవైపు పదేళ్ళుగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ఆయిల్‌, పప్పులు, బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మోడీ ప్రభుత్వం పెరుగుతున్న ధరలను నియంత్రించడం విఫలమవుతోంది. ఎపిపై ధరల ప్రభావం ఎక్కువగా ఉంది.చంద్రబాబు హయాంలో రూ.4 వేలు ఇచ్చేవారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాకా దాన్ని రూ.10 వేలకు పెంచారు. లబ్ధిదారుల ఎంపికలో నిబంధనలు కఠినతరం చేశారు. గడచిన ఐదేళ్లలో కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడిస్తున్న పరిహారం కూడా సరిపోని పరిస్థితి నెలకొంది. ఆర్థిక ఇబ్బందులతో అవస్థలుమత్య్ససంపదపై ఆధారపడి బతుకున్న వేలాది మంది ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చేపల వేట తప్ప వేరే పని చేయలేని వీరు వేట నిషేధ సమయంలో భారంగా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. కొంత మంది మత్య్సకారులు వలస బాట పడుతున్నారు. మరికొందరు కూలీ పనులకు వెళుతూ పొట్ట నింపుకుంటున్నారు. ఇంకొందరు ఇంజన్లు మరమ్మతులు, వలల అల్లికలు వంటి పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తున్నారు. చేపలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మత్య్సకార మహిళలు సైతం వేట నిషేధం కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరికి కేవలం రూ.10 వేలు ఇస్తున్నా అది కూడా సకాలంలో సక్రమంగా అందని పరిస్థితుల నడుమ మత్య్సకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️