ప్రతి పేద కుటుంబానికి ఇల్లు

Feb 10,2024 16:23 #Kakinada
housing for all kakinada

 ఇళ్ళ పట్టాలు పంపిణీలో కలెక్టర్ కృతిక శుక్ల, ఎమ్మెల్సీ పద్మశ్రీ

ప్రజాశక్తి-కాకినాడ : ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు నిర్మించే లక్ష్యంగా నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిందని ఈ కార్యక్రమం కింద శనివారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని 8 అర్బన్ వార్డులకు సంబంధించిన 2,812 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శనివారం కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా ఉన్న మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన పేదలందరికి ఇళ్లు పథకం కింద ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డా కృతికా శుక్లా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, జాయింట్ కలెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్య, కూడ చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి ఇతర ప్రజాప్రతినిధులు హాజరై ఇంటి పట్టాల పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గానికు సంబంధించి కాకినాడ పట్టణంలోని 8వార్డులలో గుర్తించిన 2,812 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా 1,20,000 ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగిందని , 70 వేలు ఇళ్ళు మంజూరు అయ్యాయని అందులో ఇప్పటివరకు 30వేల వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు.
కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద కాకినాడ నియోజకవర్గం 32 వేల ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరి చేస్తే కాకినాడ లో 680 ఎకరాల భూమిని సేకరించి ఇళ్ల పట్టాలు మంజూరి చేశామని, కొన్ని లేఔట్ లో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకుని గృహప్రవేశాలు కూడా చేశారని ఆయన తెలిపారు.

ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ మాట్లాడుతూ సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రతీక అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సీఎం ప్రజలందరి సంక్షేమం, విద్య, అభివృద్ధి , ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారని ఆమె అన్నారు. మహిళలకు ఎన్నో రకాల పథకాలను అందిస్తూ ప్రతి మహిళకు సొంత ఇల్లు ఉండాలని కలను నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుతుందని ఆమె అన్నారు.

జాయింట్ కలెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరకి ఇంటి పట్టాల ద్వారా లబ్ధి పొందడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి వారికి పూర్తి హక్కులు కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, విద్యుత్తు, మంచినీటి వసతి ఇతర వసతులు కల్పించి లేఔవుట్ ను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జే.వెంకట రావు, అడిషనల్ కమిషనర్ సీహెచ్ నాగ నరసింహారావు, కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మలమడక నాగమణి, మాజీ మేయర్ సుంకర శివ ప్రసన్న, కాకినాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యులు ఎన్‌.రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ పశుపులేటి వెంకట లక్ష్మి, వివిధ వార్డుల కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

➡️