అంగన్వాడీల సమ్మె ఉధృతం

Dec 18,2023 12:33 #Kakinada
అంగన్వాడీల సమ్మె ఉధృతం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఉదృతమైంది. సోమవారం నాటికి వీరి ఆందోళన 6వ రోజుకు చేరుకుంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాదిమంది అంగన్వాడీలు కాకినాడ ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని పలువురు వర్కర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే జిల్లావ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేసామని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ. చంద్రావతి తెలిపారు.వీరి ఆందోళనకు ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మద్దతు తెలిపి మాట్లాడుతూ పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు విశేష కృషి చేస్తున్న అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరొత్తుతున్నట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీను అమలు చేయాలని కోరుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుండడం శోచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం కంటే రూ.1000 అదనంగా వేతనం ఇస్తామని చెప్పిన జగన్ నేడు మాటతప్పి మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. స్కీమ్ వర్కర్ల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణి సరైంది కాదన్నారు. ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధనకు అవసరమైతే అంగన్వాడీలు పోరాటాలను మరింత ఉధృతం చేస్తారన్నారు.బీఎస్పీ కాకినాడ జిల్లా నాయకులు సుబ్రహ్మణ్యం తదితరులు మద్దతు తెలిపి మాట్లాడారు.

➡️