తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

May 25,2024 22:21
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

ప్రజాశక్తి-కాకినాడ పైప్‌ లైన్‌ మరమ్మతుల కారణంగా నగరంలో తాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. శనివారం అయన దుమ్ములపేట, సంజరు నగర్‌, డైరీ ఫారం ప్రాంతాల్లో ఎస్‌ఇ సత్య కుమారి, సిబ్బందితో కలిసి పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్న నేపథ్యంలో స్వయంగా ప్రజలతో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. శశికాంత్‌ నగర్‌ ఫిల్టరేషన్‌ ప్లాంట్‌కు వెళ్లే ముడినీటి సరఫరా పైప్‌లైన్‌ లీకేజీలను అరికట్టేందుకు మరమ్మతులు చేస్తున్న దృష్ట్యా ఒకటో డివిజన్‌ నుంచి 13 డివిజన్‌ వరకు ఈనెల 23వ తేదీ నుంచి నీటి సరఫరా నిలుపుదల చేశామన్నారు. మంచినీటి కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా నగరపాలక సంస్థ మంచినీటి ట్యాంకర్లతో పాటు, ప్రైవేట్‌ ట్యాంకర్లను కూడా రప్పించి ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా నీరు అందిస్తున్నామన్నారు. ఈ క్రమంలో శనివారం దాదాపు 14 ట్యాంకర్ల ద్వారా సుమారు 80కి పైగా ట్రిప్పులు వేసి నీటి సమస్య తీర్చామన్నారు. అయినప్పటికీ ఎక్కడైనా నీరు అందకపోయినా, ఇబ్బందులు ఉన్నా తక్షణమే తమ దృష్టికి తీసుకు వస్తే ట్యాంకర్లను పంపించి పరిష్కరిస్తామన్నారు. అత్యవసర మరమ్మతుల దష్ట్యా ఏర్పడ్డ ఈ అవాంతరానికి ప్రజలు సహకరించాలని కమిషనర్‌ కోరారు. నీటి సమస్య ఉంటే మొబైల్‌ నెంబర్లు 9849906507, 9959799138, 9676770461, 9848471415లో సంప్రదించాలని కమిషనర్‌ సూచించారు.

➡️