కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న రాక్‌ సిరామిక్స్‌

May 20,2024 22:14
సామర్లకోట ఎడిబి

ప్రజాశక్తి – సామర్లకోట

సామర్లకోట ఎడిబి రోడ్లులో రాక్‌ సిరామిక్స్‌ పరిశ్రమ యాజమాన్యం కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తుందని కార్మికులు ఆరోపించారు. సోమ వారం లేబర్‌ కమిషనర్‌ కార్యాలయంతోపాటు, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఆయా శాఖల అధికారులకు వినతి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరామిక్స్‌ పరిశ్రమలో పనిచేస్తున్న 30 మంది కార్మికులను ఎటువంటి ముందస్తు సమా చారం లేకుండా తొలగించడం జరిగిందన్నారు. సోమవారం ఉదయం విధులకు వెళ్తున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బందితో తమను అడ్డగించి పరి శ్రమలోకి వెళ్లనీయకుండా చేసిందన్నారు. గత 18 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నామని, అర్ధాం తరంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమను తొలగించడంతో సంబంధిత కార్మిక కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయని అన్నారు. చర్చలకు పిలిపించి మూడు నెలల జీతం ఇస్తామని, రిజైన్‌ చేసి వెళ్లి పోవాలని యాజమాన్యం చెబుతుందని, 40 నుంచి 50 సంవత్సరాలు వయస్సు పైబడిన కార్మికులను అర్ధాంతరంగా తొలగిస్తే ఏం చేయాలని ప్రశ్నించారు. తక్షణం ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారులు యాజమాన్యంతో చర్చించి తమకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసన కార్య క్రమంలో రాక్‌ సిరామిక్స్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️