రాక్‌ కార్మికుల వినూత్న నిరసన

– నష్టాల పేరుతో తొలగించడం అన్యాయం : సిఐటియు
ప్రజాశక్తి – సామర్లకోట (కాకినాడ జిల్లా) :విధుల్లోకి తీసుకోవాలంటూ రాక్‌ సిరామిక్స్‌ కంపెనీ గేటు వద్ద కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన మంగళవారం నాటికి 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ గేటు వద్ద క్రికెట్‌ ఆడుతూ నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి డి.క్రాంతికుమార్‌ మాట్లాడుతూ.. 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి నోటీసులూ ఇవ్వకుండా నష్టాల పేరుతో 24 మందిని తొలగించడం అన్యాయమన్నారు. కార్మికులను తొలగించి 71 రోజులు గడుస్తున్నా యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ లాభాల్లో ఉన్నట్లు ఆన్‌లైన్‌లో యాజమాన్యమే ప్రకటించిందన్నారు. 45, 50 సంవత్సరాలు పైబడిన కార్మికులను ఫ్యాక్టరీ నుంచి తొలగించడంతో వారి కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం యాజమాన్యం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే కంపెనీ షట్‌డౌన్‌ అయ్యేలా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు గంగాధర్‌, చంద్రశేఖర్‌, సతీష్‌, వరప్రసాద్‌, రామకృష్ణ, మల్లికార్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.

➡️