వైసిపిని గద్దె దించడమే లక్ష్యం

Apr 23,2024 22:52
వైసిపిని గద్దె దించడమే లక్ష్యం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, యు.కొత్తపల్లిరైతాంగాన్ని ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహించిన వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించేలా ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిలుపు ఇచ్చారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాకినాడ సెజ్‌ లో అప్పటి ప్రభుత్వం 10 వేల ఎకరాలను సేకరించి 15 ఏళ్లు దాటుతున్నా ఒక్క పరిశ్రమ కూడా తీసుకు రాలేదన్నారు. యజమానులు మారుతున్నారు తప్ప ఇక్కడి రైతాంగం పరిస్థితులు ఏమాత్రం మారలేదన్నారు. అరబిందో ఫార్మా కంపెనీ యాజమాన్యం ప్రతీ రైతుకి న్యాయం చేయాలన్నారు. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పిఠాపురంలో ఒక వైపు సముద్రపు తీరం, మరోవైపు పచ్చని పంట పొలాలు, సహజ వనరులు పుష్కలంగా ఉన్నా యువతకి ఏమాత్రం ఉపాధి అవకాశాలు లేవన్నారు. అభివద్ధి కుంటుపడిందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన అంబేద్కర్‌ ఆశయాల ప్రకారం అన్ని వర్గాల ప్రజల అభివద్ధి కోసం కషి జరిగేలా పనిచేస్తామన్నారు. పదేళ్ల పాటు ఒక్క పదవి కూడా లేకపోయినా కష్టపడి పార్టీను నడుపుతున్నానన్నారు. యువత, ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్ల విలువైన కాలాన్ని వైసిపికి ఇస్తే స్థానికంగా హార్బర్‌ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఉప్పాడలో హార్బర్‌ నిర్మాణం పూర్తయి ఉంటే 20 వేల కుటుంబాలకు చెందిన మత్స్యకారుల బోట్లను నిలుపుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా 30 శాతమే పూర్తయ్యాయన్నారు. నిర్మాణంపై నిర్లక్ష్యం కొనసాగుతుందన్నారు. కొన్నేళ్లుగా ఇక్కడ సుమారు 300 ఎకరాలు కోతకు గురైతే ఈ పాలకులు ఏం చేశారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సముద్రపు కోత నివారణకు శాశ్వత పరిష్కార మార్గాలను చూపుతామని హామీ ఇచ్చారు. పిఠాపురాన్ని దేశమంతా చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. వ్యవసాయం, ఉద్యానం, మత్స్య సంపద, పాడి పరిశ్రమ, చేనేత ఇలా అన్ని రంగాల అభివద్ధికి ఉమ్మడిగా పని చేస్తామని తెలిపారు. ఉప్పాడను బీచ్‌ కారిడార్‌గా అభివద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కష్టాలకు ప్రతినిధిగా మారి పని చేస్తానని హామీ ఇచ్చారు. రిలయన్స్‌, అరబిందో, ఒఎన్‌జిసి వంటి సంస్థల పైపులైను వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారుల కోసం నిలబడి పని చేస్తానన్నారు.

➡️