ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు అత్యంత కీలకం

Apr 16,2024 23:07
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతీ ఒక్క ఓటు అత్యంత

ప్రజాశక్తి – కాకినాడ

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతీ ఒక్క ఓటు అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ చానల్స్‌ ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ రానున్న మే నెల 13న జరగనున్న పోలింగ్‌ నేపథ్యంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనేలా అవగాహన కల్పించేందుకు అనేక వినూత్న కార్య క్రమాలు చేపడుతున్నామన్నారు. తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువత, అధిక వయసు కలిగిన ఓటర్ల పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం తొలి సారిగా ఈ ఎన్నికల్లో హోం ఓటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. చాలామందిలో ఓటు ఎందుకు వేయాలి, నా ఒక్క ఓటుతో ఏమీ కాదులే, సెలవు రోజు కదా, వేరే కార్యక్రమాలు, ఇంటి వద్దనే పనులను పురమాయించుకుని ఓటు హక్కును వినియోగించుకోవడం నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ప్రస్తుత సమాజంలో యువతతోపాటు అన్ని వయసులవారు సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ ఛానల్స్‌ను అనుచరిస్తున్నందున ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టికి, బలోపేతానికి ప్రతి ఒక్క ఓటు అత్యంత కీలకమనే విషయానికి సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలనికోరారు. కాకినాడ జిల్లా భౌగోళిక పరిస్థితులు, ఇతర వనరులను దృష్టిలో ఉంచుకుని ఓటర్లను చైతన్య పరుస్తూ వినూత్నంగా వీడియోలు రూపొందించాలన్నారు. సాధారణ ఎన్నికల్లో కాకినాడ జిల్లా పోలింగ్‌ శాతం పెరిగేందుకు ప్రతి ఒక్కకూ కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో స్వీప్‌ జిల్లా నోడల్‌ అధికారులు పి.విజరుభాస్కర్‌, ఎం.బానుప్రకాష్‌, వివిధ సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ చానల్స్‌ ప్రతినిధులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️