కౌలు రైతు కష్టాలు తీరేనా..?

Jun 19,2024 21:46
సాగు చేస్తున్న కర్షకులు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి

గ్రామాల్లో కౌలు చేసుకుని సాగు చేస్తున్న కర్షకులు నష్టపోతున్నారు. వ్యవసాయ భూమి కలిగిన రైతులు మాత్రమే ప్రభుత్వ దష్టిలో అన్నదాతలుగా పరిగణింపబడటమే ఈ దుస్థితికి కారణం. అయితే ప్రభుత్వం అందించే ఎలాంటి పథకాలు వర్తించకున్నా, సబ్సిడీలు, ఉచిత పథకాలు, పంట నష్టపోతే నష్టపరిహారం రాకున్నా వ్యవసాయమే జీవనాధారంగా శ్రమ చేస్తున్నారు. ఈ కౌలురైతుల్లో చిన్న, సన్నకారు రైతులే అధికంగా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్‌ 2 లక్షలకు పైగా సాగు జరుగుతోంది. సుమారు లక్షకుపైగా కౌలు రైతులు ఉన్నారని అంచనా. సగం వరకు లెక్కల్లో లేని విధంగా కౌలు రైతులు ఉన్నారని గ్రామాల్లో ఉండే కర్షకుల అంచనా. కౌలు రైతులు గ్రామాల్లో రెండు రకాలుగా ఉన్నారు. పూర్తిస్థాయిలో భూమి లేనివారు ఇతర వ్యక్తుల నుంచి భూమి తీసుకుని సాగు చేస్తున్నారు. అత్యధిక మంది భూ యజమాని నుంచి కౌలునామా పత్రం సైతం రాసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఇదే తరహాలో మరో కౌలు రైతులు కూడా ఉన్నారు. వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకుని ఉండే రైతులు తమకున్న ఎకరం, రెండకరాలతో పాటు తమ సామర్థ్యానికి అనుగుణంగా తమ పక్కన ఉన్న భూములనో, లేదా ఇతర చోట్ల ఉన్న భూములనో కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఇలాంటి చిన్నసన్న కారు రైతులు కౌలుకు తీసుకుని చేసే పద్ధతి జిల్లాలో ఎక్కువ శాతంలో ఉంటుంది. నూతన ప్రభుత్వమైగత ప్రభుత్వ నిబంధనలను సడలించి కౌలు రైతులందరికీ సిసిఆర్‌సి కార్డులు అందించేలా చర్యలు చేపట్టాలి.కౌలు ధరలు పైపైకిఎకరా భూమికి రైతులు చెల్లించే కౌలు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు పలుకుతోంది. నీరు సమద్ధిగా ఉండి, అనుకూలమైన విధంగా భూమి ఉంటే కౌలు చెల్లించే డబ్బులు అధిక మొత్తంలో చెల్లించక తప్పడం లేదు. కొంతమంది రైతులు మాత్రమే కౌలునామా రాసుకుంటుండగా మరికొంత మంది మాటపూర్వకంగా వారికున్న సత్సంబంధాలతో కౌలుకు చేస్తున్నారు. అయితే కొంతమంది భూ యజమానులు నగదు కాకుండా పండిన పంటలో ఎకరానికి 6 నుంచి 14 బస్తాల చొప్పున తీసుకుంటున్నారు. ఎకరం వరి పంట సాగయ్యేందుకు కావాల్సిన మొత్తం ఖర్చు సుమారుగా రూ.36 వేలు. ఇవికాక, మార్కెట్‌కు వెళ్లిన తర్వాత హమాలీ ఛార్జీలు, వర్షం కురిస్తే పరదాల కిరాయిలు, వర్షానికి తడిసి నీటిపాలయ్యే ధాన్యం ఇవేమి యజమానికి సంబంధం లేదు. ఎకరానికి వచ్చే దిగుబడి సన్నరకం 32 బస్తాలు. ఒక బస్తా బరువు 70 కేజీలు ఉంటే ఎకరానికి 32 బస్తాలైతే 22.40 క్వింటాళ్లు. 36 బస్తాలైతే 25.20 క్వింటాళ్లు. అంటే ఎకరానికి ప్రభుత్వం అందించే మద్దతు ధర రూ.2040 అందిస్తోంది. ఎకరానికి రూ.50 వేల వరకు రైతుకు నగదు రూపంలో అందుతోంది. ఇందులో రైతు కౌలుచేస్తే భూ యజమానికి ఇవ్వగా మిగిలేది కూలి కూడా కష్టమేనని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితులలో అతివష్టి వచ్చినా, అనావష్టి వచ్చిన తట్టుకుని సాగు చేసినా చివరకు నష్టాలు మిగిలుతున్నాయి. గుర్తింపు కార్డులేవి..ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ యజమానుల నుంచి కౌలునామా పత్రాలు రాసిచ్చి అంగీకారం తెలిపితే గుర్తింపు (సిసిఆర్‌సి) కార్డులు ఇస్తున్నారు. కొంతమంది రైతులు నిరాకరించడంతో కౌలునామా పత్రాలు కనుమరుగయ్యాయి. నిబంధనల ప్రకారం కౌలు రైతులను గుర్తించి, వారికి రుణ అర్హత కార్డులు అందచేసి, బ్యాంకు రుణాలు కూడా ఇవ్వాలి. కానీ, వీరిపై రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాగం ఎలాంటి దయ చూపడం లేదు. దీంతో ఎలాంటి సహకారానికి నోచుకోవడం లేదు. కౌలు రైతులకు ఇతర రంగాల్లో ప్రావీణ్యం లేకపోవడంతో లాభనష్టాలతో సంబంధం లేకుండా కౌలును చెల్లించి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. కౌలు రైతులకు ఎక్కడా అధికారిక గుర్తింపు లేకపోవడంతో ప్రభుత్వాల రైతుల సంక్షేమ పథకానికి వీరు అనర్హులుగా మిగిలిపోతున్నారు. గత ప్రభు త్వం చేపట్టిన పథకాలను సైతం అత్యధిక మంది పొందలేకపోయారు. ఇక కనీసం బ్యాంకు నుంచి రుణాలు పొందాలనుకున్నా పొందలేని పరస్థితిలో కౌలు రైతులు ఉన్నారు. వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీకి రుణాలు తెచ్చుకుని వ్యవసాయం చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం అందించే అన్ని రకాల సాయం అందేలా చూడాలని కౌలురైతులు కోరుతున్నారు.

➡️