రాజమహేంద్రవరంలో వైసిపికే పట్టం-

May 13,2024 23:26
రాజమహేంద్రవరం అర్బన్‌

గెలుపుపై అర్బన్‌ ఎంఎల్‌ఎ అభ్యర్థి భరత్‌ జోస్యం

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గంలో ఓటర్లు వైసిపికే పట్టం కట్టబోతున్నారని వైసిపి అర్బన్‌ నియోజకవర్గ అభ్యర్థి మార్గాని భరత్‌ రామ్‌ జోస్యం చెప్పారు. నగరంలోని విఎల్‌ పురం చేపల మార్కెట్‌ పక్కన సచివాలయంలో బూత్‌ నెం 160లో ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో ప్రతీ బూత్‌ వద్దకు ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు తరలిరావడం చూస్తుంటే నగరంలో నేను చేసిన అభివృద్ధిని చూసి ఎంఎల్‌ఎగా నన్ను గెలిపించేందుకు ఒక దృఢమైన నిర్ణయంతో వచ్చారన్నారు. కూటమిపై ప్రజలకెవరికీ నమ్మకం లేదన్నారు. ఎందుకంటే 2014లో ఇదే కూటమితో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం ప్రజలకు, రాష్ట్రానికీ చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు అప్పుడు ఏకంగా 640 హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ప్రజలు 2019లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. మళ్ళా ఇప్పుడు అదే కూటమి ‘అది చేస్తాం ఇది చేస్తాం’ అని శుష్క వాగ్దానాలిచ్చేస్తే నమ్మడానికి ప్రజలేమీ అమాయకులు కాదన్నారు. జగన్మోహన్‌ రెడ్డి అంటే ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక నిజమని చెప్పారు. ఈ అయిదు సంవత్సరాలలో జగనన్న చెప్పిందానికన్నా ఎక్కువే చేసి ప్రజాభిమానం చూరగొన్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా సంక్షేమ రాజ్యం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్ళా జగనన్నను సీఎం చేయడానికి పట్టం కట్టబోతున్నారని అన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయల పెన్షన్‌ కోసం అవ్వాతాతలు, దివ్యాంగులు ఎన్ని కష్టాలు పడేవారో అందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో 66 లక్షల మందికి పెన్షన్లు వైసిపి ప్రభుత్వం అందజేస్తోందన్నారు. ప్రతిపక్షాలు ఊహా లోకంలో విహరిస్తున్నాయని, 2019 ఎన్నికల నాటి తీర్పు మరోసారి రానుందని తెలిపారు.

➡️