కమనీయం… శ్రీసీతారాముల కల్యాణం

ప్రజాశక్తి-వాల్మీకిపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన వాల్మీకిక్షేత్రం శ్రీ పట్టాభిరా మస్వామి సాలకట్ల బ్రహ్మౌత్సవాల్లో భాగంగా ఆరవ రోజు బుధవారం రాత్రి 8గంటల నుంచి 10 గంటల వరకు ఆశ్లేష నక్షత్రంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిం చారు. సాధారణంగా అన్ని రామక్షేత్రాలలో శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణం నిర్వహిస్తుంటారు. అయితే దేశంలో ఇందుకు భిన్నంగా వాల్మీకిపురంలో సీతమ్మవారు జన్మదినమైన ఆశ్లేష నక్షత్రంలో సీతారాముల కల్యాణం నిర్వహిం చడం ఇక్కడి విశేషం. వేకువజామున సుప్రభాతసేవతో స్వామి వారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, తోమాలసేవ, పంచాంగ శ్రవణం, అర్చన, కొలువు, బలి, శాత్తుమొర, ఉదయం తిరుచ్చిలో స్వామివార్లకు అలంకరణ, అనంతరం తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అలాగే 10గంటల నుంచి స్నపన తిరు మంజనంకు విచ్చేసిన భక్తులు స్నపన తిరుమంజనం తిలకించి తన్మయత్వం చెందారు. సాయంత్రం ఊంజల మండపంలో స్వామివారికి ఊంజల్‌ సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. నూతన వధూవరులైన సీతారాములకు పట్టుపీతాంబరాలు, విశేషాభర ణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు పట్టణ పరిధి తోటవీధిలోని టిటిడి స్థలంలో ఆరుబయట ఏర్పాటు చేసిన అతిసుందరంగా అలంకరించిన మైధిలి కల్యాణ వేదికపై వేదపం డితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆర్జిత కల్యాణోత్సవ దంపతులు ఆశీనులై తిలకిస్తుండగా సీతారాముల కల్యాణ మహౌత్సవం కన్నులపండువగా జరిగింది. సీతారాములు ముత్యపు తలంబ్రాలతో తడిసి ముద్దయ్యారు. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రులవారిని అలంకరించి ఆస్థానం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కల్యాణోత్సవానికి వేలాది మంది భక్తులు రావడంతో తోటవీధి కిక్కిరిసింది. ఆర్జిత కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు నూతన వస్త్రం, ప్రసాదాలను అందజేశారు. రాత్రి 11గంటలకు తనప్రియమైన గరుడ వాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి తిరుమాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ 50 సంవత్సరములకు ఒకసారి మాత్రమే శ్రీరామనవమి రోజున సీతమ్మ నక్షత్రము ఆశ్లేష నక్షత్రము రావడం విశేషమన్నారు. భక్తులకు తోటవీధి స్థానికుడు దశరథ రామవంశి బెల్లంపానం, వడపప్పు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

➡️