కిమిడికి తప్పని ఇంటిపోరు

Apr 11,2024 21:03

ప్రజాశక్తి- చీపురుపల్లి: పెదనాన్న ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఓ వైపు సన్నధ్దం అవుతుండగా… ఆయనకు వ్యతిరేకంగా నామినేషన్‌ వేసి ఎన్నికలలో నిలబడతానని నాగార్జున అంటున్నారు. ఈ ఆశక్తికరమైన రాజకీయం చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభమై ఊపందుకుంది. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జితో పాటు విజయనగరం జిల్లా అద్యక్షుడిగా కిమిడి నాగార్జున గత ఐదేళ్ల నుండి పని చేస్తున్నారు. తన శాయశక్తులా అటు మంత్రి బొత్స సత్యన్నారాయణను, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ను, ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌ని ఎదుర్కొని పోరాటాలు చేశారు. 2014లో కిమిడి మృణాలిని ఇక్కడ నుండి పోటీ చేసి బొత్స సత్యన్నారాయణపై గెలుపొంది మంత్రిగా పని చేశారు. 2019లో ఆమె కుమారుడైన కిమిడి నాగార్జునకి టిడిపి చీపురపల్లి టిక్కెట్‌ ఇచ్చింది. అప్పుడు పోటీ చేసిన నాగార్జున బొత్స సత్యన్నారాయణపై ఓడిపోయారు. అయినప్పటికి తన వెంట ఉన్న ఏ ఒక్క కార్యకర్తనూ టిడిపి నుండి ప్రత్యర్ధి పార్టీవైపు చూడకుండా వారి కష్టసుఖాలలో అహర్నిసలు అధికార పార్టీకి ఎదురొడ్డి నిలబడ్డారు. నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యకర్తకు కష్టం వచ్చినా తానున్నానంటూ వారికి అండగా నాగార్జున నిలబడ్డాడు. దీంతో నాగార్జున పై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభిమానులు ఏర్పడ్డారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ నుండి నాగార్జునిని కాదని అనేక పేర్లుని అదిష్టానం ప్రతిపాదనలోనికి తీసుకురావడంతో నాగార్జున మనస్తాపానకి గురైయ్యాడు. అంతే గాకుండా అదిష్టానం ఏమీ నాగార్జునతో సంప్రదించకుండా కిమిడి కళావెంకటరావుకి చీపురుపల్లి అసెంబ్లీ టిక్కెట్‌ ప్రకటించడపట్ల షాకయ్యాడు. దీంతో తాను ఎంటి పరిస్థితులలోనూ పోటీలో ఉంటానని తన అనుచర వర్గంతో చెబుతున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగా ఈ నెల 18 లేదా 20వ తేదీలలో చీపురుపల్లి అసెంబ్లీ నుండి నామినేషన్‌ వేయనున్నట్లు నాగార్జున కార్యకర్తల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అందుకు సిధ్దంగా ఉండాలని కార్యకర్తలకు, అభిమానులకు సూచించినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా చీపురుపల్లి టిక్కెట్టుని గెద్దలా తన్నుకుపోయిన కిమిడి కళావెంకటరావు ఇప్పటి వరకు నాగార్జునుని కలవడం గానీ, కనీసం ఫోన్‌ కూడా చేయలేదని నాగార్జున వర్గం చెబుతున్నారు. అదిష్టానం ఇంత చెబుతున్నప్పటికీ కళావెంకటరావు వ్యవహార శైలి భిన్నంగా ఉండడంతో టిడిపి కేడర్‌లో, నాయకులలోనూ ఒకింత అసహనానికి తావిస్తోందని పలువురు చర్చించుకుం టున్నారు. ఐదేళ్లపాటు చీపురుపల్లిలో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు, ఆర్‌ఇసియస్‌ విలీనానికి వ్యతిరేకంగా పోరాటంతో పాటు అనేక అంశాలపై నాగార్జున చేసిన కృషి ప్రజల మనసుల్ని ఆకట్టుకు న్నప్పటికీ నాగార్జున్‌ను ఎందుకు కలుపుకు పోవడంలేదని కళావెంకటరావుని పలువురు నాయకలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నాలుగు మండలాలలో జరిగిన కార్యకర్తల సమావేశాలలో కూడా కళావెంకటరావుతో సంబంధిత నాయకులు బహిరంగంగానే నాగార్జునుని కలుపుకొని పోవాలని లేదంటే గెలుపు కష్టమవుతుందని చెబుతున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా కళావెంకటరావు ఒంటెద్ది పోకడతో ముందుకు వెలుతున్నట్లు కొంతమంది నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కిమిడి కుటుంబాలలో విరోదాలు మరచి కలసి ప్రజలలోనికి వెల్లి ప్రచారం నిర్వహిస్తారో లేదా చీపురుపల్లి నుండి కళావెంకటరావు, నాగార్జునలు వేరు వేరు నామినేషన్లు వేస్తారో వేచి చూడాల్సిందే.

➡️