అర్జీదారుల సంతృప్తే ధ్యేయంగా స్పందన

Mar 4,2024 23:08
అర్జీదారుల సంతృప్తే ధ్యేయంగా స్పందన

ప్రజాశక్తి-అమలాపురం జగనన్నకు చెబుదాం-ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాల్లో అందిన అర్జీలను నాణ్యతా ప్రమాణాలు, అర్జీదారుల సంతృప్తే ధ్యేయంగా పరిష్కరించాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలోని గోదావరి భవన్‌లో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జగనన్నకు చెబుదాం- స్పందన కార్యక్రమాలను జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లుతో కలిసి జిల్లావ్యాప్తంగా అర్జీదారుల నుంచి అందిన వినతులను మర్యాద పూర్వకంగా సావధానంగా విని నిబంధనలకు అనుగుణంగా ఉన్న పరిష్కారం కొరకు అర్జీలను స్వీకరించారు. ఈ యొక్క అర్జీలను సత్వరం పరిష్కరించాల్సిందిగా స్థానికంగా అందుబాటులో ఉన్న ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయి నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత తహశీల్దార్లు, ఎంపిడిఒలతో వర్చువల్‌ విధానంలో సంప్రదించి అర్జీదారులకు తగు పరిష్కార మార్గాలు చూపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం 226 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందిన ప్రతి వినతినీ క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారిస్తూ నాణ్యమైన పరిష్కార మార్గాలు అర్జీదారుడు సంతప్తి చెందే స్థాయిలో చూపుతూ అర్జీదారులలో విశ్వసనీయతను పెంపొందించాలన్నారు. గడువు దాటిన అర్జీలు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎస్‌.మధుసూదన్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకులు శివరామ్‌ప్రసాద్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం.దుర్గారావు దొర, ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్రావు, గ్రామ వార్డు సచివాలయ నోడల్‌ అధికారి కె.భీమేశ్వరరావు, డిఆర్‌ఎడి పీడీ వి.శివశంకర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️