అల్బెండజోల్‌ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు

Feb 7,2024 22:36
అల్బెండజోల్‌ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు

ప్రజాశక్తి-అమలాపురం జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అల్బెండజోల్‌ మాత్రల పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో దినోత్సవం పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 3,06,833 మంది చిన్నారులను లక్ష్యంగా నిర్ధేశించారని చెప్పారు. అంగన్వాడీలకు చెందినవారు 62,965 మంది కాగా పాఠశాలలో చెందినవారు 2,09,824 మంది ఉన్నారన్నారు. బడి బయట పిల్లలు 1420 నమోదు కాని పిల్లలు 1120 మంది, జిల్లావ్యాప్తంగా పాఠశాలలు 88 జూనియర్‌ కళాశాలలో 27 డిగ్రీ కళాశాలలో 1750 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ టార్గెట్‌ పిల్లలు ఉన్నారన్నారు. ఆల్బెండజోల్‌ మాత్రలను ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించినట్టు చెప్పారు. ఎంపిడిఒలు, మున్సిపల్‌ కమిషనర్లు తమ పరిధిలోని పాఠశాలలకు మాత్రమే తరలించి యాప్‌లో నమోదు చేయాలన్నారు. నులి పురుగుల వల్ల రక్త హీనత, పోషకాలు లోపం, ఆకలి మందగించడం, నీరసం, ఆందోళన, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఆల్‌బెండజోల్‌ మాత్ర వేయడం ద్వారా రక్త హీనత నివారణ, పోషకాలు గ్రహిస్తారన్నారు. తద్వారా చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే ఈ మాత్రల పంపిణీ ద్వారా ప్రతి విద్యార్థికీ అందజేయాలని, 9వ తేదీన మాత్రలు తీసుకొని వివిధ కారణాల మూలంగా మిగిలిన పిల్లలకు 16న విధిగా అందించాలని ఆమె స్పష్టం చేశారు. ఒకటి నుండి రెండేళ్ల వయసు గల వారికి ఆల్బెండజోల్‌ సగం మాత్రను, రెండు నుండి 19 ఏళ్ల వయసు గల వారికి ఒక మాత్రను అందించి భోజనం అనంతరం మాత్రలు మింగించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ వి.శివశంకర్‌ ప్రసాద్‌, డిఎఒ ఎం.కమల కుమారి, సాంఘిక సంక్షేమ సాధికార అధికారి పి.జ్యోతిలక్ష్మి దేవి, జిల్లా బిసి వెల్ఫేర్‌ ఆఫీసర్‌ వై.సాంబమూర్తి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని సిహెచ్‌వి.భరతలక్ష్మి, ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శంకర్రావు, కో ఆర్డినేటర్‌ జాన్‌ లెవ్వి తదితరులు పాల్గొన్నారు.

➡️