ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణ ఆయుధం

Mar 21,2024 22:44
ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణ ఆయుధం

ప్రజాశక్తి-అమలాపురంఓటుతో దేశ భవిష్యత్తు నిర్దేశితం అవుతుందని దేశ భవిష్యత్తును మార్చేది ఓటేనని డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం స్థానిక జిఎంసి బాలయోగి స్టేడియంలో జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో క్రమబద్ధమైన ఓటరు విద్య ప్రజాస్వామ్యంలో ఓటర్ల భాగ స్వామ్యం (స్వీప్‌) అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు ప్రాధాన్యతను చాటి చెప్పే రీతిలో రూపొందించిన రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించి ఓటర్లను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా ఓటే ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయుధమని ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలంటూ డ్వాక్రా సంఘాల మహిళలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ. ప్రజాస్వామ్యానికి ఓటు పునాది అని తెలిపారు. దేశంలో నివసించే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని చెప్పారు. అర్హులైన వారు తమ ఓటును నమోదు చేయించుకుని వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరూ ఓటు వేయాలన్నారు. మద్యం, డబ్బు, బహుమతులు వంటి ప్రలోభాలకు గురి కావద్దని సూచించారు. భారత పౌరులుగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తద్వారా ఓటు హక్కును సక్రమంగా విని యోగించుకోవాలని చెప్పారు. మహిళలు యువత ఓటు హక్కు పట్ల అవగాహన కలిగి బాధ్యతాయుతంగా వ్యవ హరించి తమ ఓటు విలువను తెలుసుకుని సద్వినియోగం చేసు కోవాలన్నారు. ప్రజా స్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు ప్రధాన ఆయుధమని, అటువంటి ఓటు హక్కును బాధ్యతాయుతంగా నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలని పిలుపు నిచ్చారు. ఇవిఎం యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై పోలింగ్‌ కేంద్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోచాలని, ప్రతి ఒక్కరికీ ఓటు చాలా ముఖ్యమైనదని ఓటు ద్వారానే సమాజానికి మంచి చేసే ప్రజా ప్రతినిధులను అందించే అవకాశం ఉందని తెలిపారు. యువతలో అనంతమైన శక్తి దాగి ఉంటుందని, దాన్ని ఆలోచించుకోగలిగే శక్తి యువతలో ఉందని, ఒక్క ఓటుతో ఫలితాలు మారిపోతుందని అందుకే ఓటు హక్కును ప్రతిఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ పథక సంచాల కులు వి.శివశంకర్‌, ప్రసాద్‌ జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎస్‌ మధుసూదన్‌, జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివద్ధి అధికారిని ఎం ఝాన్సీ రాణి,సర్వ శిక్ష అభియాన్‌ ఏపీసీ మధు సూదన రావు, డ్వాక్రా మెప్మా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️