దళితులపై వివక్ష ప్రదర్శిస్తే తగు చర్యలు

Jan 25,2024 17:13

మాట్లాడుతున్న ఎస్‌సి కమిషన్‌ సభ్యులు ఆనంద్‌ ప్రకాష్‌

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌

ప్రభుత్వం, రాజ్యాంగం, చట్టం ఆయా వ్యవస్థల నిర్వహణలో దళిత వర్గాలకు ఎక్కడైనా వివక్షకు గురైన వారు కమిషన్‌ దృష్టికి తీసుకుని వస్తే వాటిపై తగు చర్య తీసుకోవడమే ఎస్‌సి కమిషన్‌ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఎస్‌సి కమిషన్‌ సభ్యులు చల్లం ఆనంద్‌ ప్రకాష్‌ తెలిపారు. గురువారం అమలాపురం మండల అభివద్ధి కార్యాలయంలో మండలానికి సంబంధించిన ఎస్‌సి సర్పంచులు, ఎంపిపిలు, జెడ్‌పిటిసి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌సి కమిషన్‌ సభ్యులు మాట్లాడుతూ కుల వివక్ష లాంటి సంఘటనలు కమిషన్‌ దృష్టికి వస్తే అలాంటి చోట్ల జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు సజావుగా అందుతుంది లేనిదీ కమిషన్‌ పరిశీలిస్తుందన్నారు. పథకాల అమల్లో ఏమైనా వివక్ష గురి అవుతున్నారా అనే అంశాలను కమిషన్‌ దృష్టి సారిస్తుందన్నారు. ఇందులో భాగంగా బండారులంక గ్రామ సచివాలయన్ని సందర్శించి అక్కడ సిబ్బందిని సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నానని అన్నారు. వాలంటీర్‌ ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాలు పనితీరును అడిగి తెలుసుకున్నానని, గ్రామ సచివాలయ ఉద్యోగులు సంతప్తికరమైన సమాధానం ఇచ్చారని కమిషన్‌ సభ్యులు తెలిపారు. తిరుపతి, వైజాగ్‌ లాంటి కేంద్రాల్లో ఎస్‌సి, ఎస్‌టి యువత కోసం స్టడీస్‌ సర్కిల్‌ సెంటర్ల ద్వారా సాధారణ పొటీ పరీక్షలతోపాటు ఐఎఎస్‌ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు వెళ్లడానికి శిక్షణిస్తారన్నారు. ప్రతి జిల్లా, రెవెన్యూ, డివిజన్‌, మండల కేంద్రాల్లో పౌర హక్కుల దినోత్సవం సమావేశాలు నిర్వహిస్తుండాలన్నారు. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం రూ.62 వేల కోట్లు ఖర్చు పెట్టింద న్నారు. వివిధ సంక్షేమ అభివద్ధి కార్యక్రమాల్లో దళిత వర్గాలకు సబ్‌ ప్లాన్‌ సజావుగా అమలు జరుగుతుందని కమిషన్‌ సభ్యులు పేర్కొన్నారు. పౌర హక్కుల సమీక్షలు నిరంతరం జరిగే విధంగా కమిషన్‌ పర్యవేక్షిస్తుందన్నారు.ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జ్యోతిలక్ష్మిదేవి, అమలాపురం ఎంపిడిఒ జె.వెంకటేశ్వరరావు, రెవెన్యూ, పోలీస్‌ సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

➡️