పార్కింగ్‌ చేసిన స్కూల్‌ బస్సు దగ్ధం

Feb 18,2024 22:35

తాళ్లపూడి వద్ద అగ్ని ప్రమాదంలో దగ్ధమవుతున్న బస్సు

ప్రజాశక్తి- రామచంద్రపురం

కె.గంగవరం మండలంలోని తాళ్లపోడు గ్రామంలో ఆదివారం ఉదయం స్కూల్‌ బస్సు దగ్ధమైంది. యానాం సమీపంలోని రవి కాలేజీకి చెందిన ఈ బస్సు ప్రతిరోజు కె.గంగవరం మండలంలోని తాళ్లపూడి పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులను కళాశాలకు తీసుకువెళుతుంది. ఆదివారం కావడంతో బస్సు యథావిధిగా తాళ్లపూడిలో నిలిపివేశారు. ఇది కొత్త బస్సు కావడంతో బస్సు బ్యాటరీ వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోగా ఎవరికి ఏ విధమైన ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామస్తులే మంటలను అదుపు చేశారు. మంటలను అదుపు చేసిన స్థానికులను అగ్నిమాపక సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రమాదానికి కారణాలను పరిశీలించారు. సుమారు రూ.15 లక్షల వరకు నష్టం ఉంటుందని అంచనా వేశారు.

➡️