మిడ్డే మీల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Feb 3,2024 18:01

ఎంఇఒకు వినతిపత్రం అందజేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు

ప్రజాశక్తి-అమలాపురం

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సిఐటియు) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. శనివారం రామచంద్రపురం, అమలాపురం, మల్కిపురం, కొత్తపేట మండలాల్లో ఎంఇఒలకు యూనియన్‌ అధ్యక్షురాలు కె.సత్యవేణితో కలిసి మధ్యాహ్న భోజన కార్మికులు వినతి పత్రాలు అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోందన్నారు. అయితే గత 23 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులతో ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయిస్తున్నాయన్నారు. సిఎం జగన్‌ ఇచ్చిన హామీ రూ.10 వేలు వేతనం, ప్రతి నెలా 5 వ తేదీ లోపు వేతనాలు, బిల్లులు ఇవ్వాలని, గ్యాస్‌ ను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. 12 నెలలకు వేతనాలు ఇవ్వాలని, మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు రూ.20లకు పెంచాలని, ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని, వంటచేసేటప్పుడు అగ్నిప్రమాదానికి గురైనటువంటివారికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. స్కూల్స్‌లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్‌ ఏర్పాటు చేయాలని, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని, మౌలిక సదుపాయాలు మంచినీరు, వంటషెడ్‌, గ్యాస్టవ్‌ ప్రభుత్వమే కల్పించాలని, సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్‌ ఇవ్వాలని మట్టి ఖర్చులు (దహన సంస్కారాలకు) ఇవ్వాలని, మెటర్నిటీ బెనిఫిట్‌ కల్పించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందజేశామన్నారు.

 

➡️