ముందుకు సాగని జల్‌ జీవన్‌..

Mar 4,2024 23:05
ముందుకు సాగని జల్‌ జీవన్‌..

ప్రజాశక్తి-ఆత్రేయపురం మనిషికి కనీస అవసరమైన తాగునీరు సగటున రోజుకు 40 లీటర్లు నీటిని అందిస్తున్నామంటూ అధికారులు వేస్తున్న లెక్కలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కనబడడం లేదు దీంతో ప్రైవేటు ప్లాంట్లలో తాగునీరుని కొనుక్కుని తాగే పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇంటింటికీ తాగునీరు అందించాలని లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా పనులు చేపడతాయి. జిల్లాలోని 22 మండలాల్లో 1,348 ఆవాసాల్లో రూ.515 కోట్లతో 1,834 పనులు చేసేందుకు కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇప్పటివరకు 915 పనులు పూర్తయ్యాయి. 919 పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిపివేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే ఈ పనులకు 50 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం, 50 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం పిఇఎంఎస్‌ అకౌంట్లో జమ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో డబ్బులు జమ చేసిన తర్వాతే, కేంద్ర ప్రభుత్వం ఖాతాకు నిధులు మళ్లిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అకౌంట్‌కు నిధులు మళ్లించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఖాతాకి నిధులు మళ్ళించడం లేదు. దీంతో బిల్లులు ఆగిపోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. నియోజకవర్గంలోని 4 మండలాల గ్రామాల్లో 223 పనులకు గాను రూ.102.8 కోట్లు మంజూరు కాగా 50 శాతం పనులు పూర్తయ్యాయి. 80 శాతం పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. 93 పనులు ఇంకా మొదలు పెట్టలేదు. పూర్తయిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేశారు. మండలం 17 గ్రామాల్లో 33 ఆవాసాల్లో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు రూ.19 కోట్ల నిధులు మంజూరయ్యాయి. రూ.7.50 కోట్లతో పనులు పూర్తయినట్లు ఇంజనీరింగ్‌ అధికారులు చెప్తున్నారు. 33 ఆవాసాలు గాను 9 ఆవాసాల్లో పనులు పూర్తయ్యాయి మిగతా గ్రామాల్లో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో తాగునీరు ఇంటి వద్దకే వస్తుంది అనుకునే సామాన్యుడి కల నెరవేరలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమన్వయ లోపం లేక నిధులు లభ్యత లేకపోవడం వంటి పలు కారణాలతో పనులు నిలిచిపోయాయి. దీంతో సామాన్యునికి తాగునీరు అందని ద్రాక్షగానే మిగిలింది. దీంతో ప్రైవేట్‌ ప్లాంట్లలో తాగునీరు డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి నెలకొంది ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు మాత్రం మనిషికి సగటున రోజుకు 40 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామంటూ లెక్క చూపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఇవేమీ కాన రావడం లేదు నాసిరకం పైపులతో పనులుగ్రామీణ ప్రాంతాలో ఏవైనా పనులు చేపడితే ఆ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సమావేశం ఏర్పాటు చేయాలి. వారి ప్రాంతాల్లో జరిగే పనుల గురించి వివరించి మినిట్స్‌ తయారు చేసి పనులు జరిగే విధానాలు తెలియజేసి పనులు గ్రామస్తుల పర్యవేక్షణలో పనులు నిర్వహించాలి. కానీ ఇవేమీ ఇక్కడ కానరావు. దీంతో కాంట్రాక్టర్‌ ఇష్టానుసారంగా నాసిరకం పైపులు వేసి పనులు చేస్తున్న పట్టించుకున్న వారే లేకుండా పోయారంటున్నారు. దీంతో పనులు జరిగిన కొద్ది కాలానికి పైపులైన్లు లీకేజీలు ఏర్పడి తాగునీరు కలుషితమై అక్కడ ప్రజలు రోగాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు.

➡️