శివారు ప్రాంతాలకు అందని సాగునీరు

Mar 11,2024 23:16
శివారు ప్రాంతాలకు అందని సాగునీరు

ప్రజాశక్తి-అమలాపురం అధికారులు సమన్వయంతో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి కాలువ చిట్టచివరి భూములకు సాగునీరు అందించాలని, సాగునీరు ఏ ఒక్క ఎకరానికి అందలేదన్న మాట వినిపించకూడదని అధికారులు ప్రజాప్రతినిధులు జిల్లా నీటి యాజమాన్య సమావేశంలో పలికిన పలుకులు. కానీ వాస్తవంగా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వార బందీ విధానంపై రైతులకు పూర్తి అవగాహన పెంపొందించి సక్రమంగా సాగునీరు సరఫరా చేయాలని రబీ సీజన్‌ను మార్చి 31 నాటికి పూర్తి చేసే దిశగా రైతాంగాన్ని చైతన్యపరిచి తక్కువ కాల పరిమితి గల వరి పంటలను రకాలను ప్రోత్సహించాలని, తదుపరి మూడో పంటకు అవకాశం కల్పించాలని ఈ సమావేశాల్లో చెప్పే మాటలు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో వారబంది పద్ధతి అమలు ద్వారా సాగునీరు సరఫరా చేస్తున్నప్పటికీ వంట కాలువ శివారు ప్రాంతాలకు సాగునీరుందక వరిచేలు బీటలు వారాయి. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరిచేలు పాలు పోసుకుని, ఈనిక స్థితిలో సాగునీరు అందని పరిస్థితుల్లో నీటి ఎద్దడితో అల్లాడుతుండటంతో రైతులకు భారీ నష్టం సంభవించే అవకాశం ఉంది. మిచౌంగ్‌ తుపానుతో తొలకరి పంట పూర్తిగా నష్టపోయిన జిల్లా రైతులు దాళ్వా పంట లోనైనా నాలుగు బస్తాలు పండితే అప్పులు తీరుతాయని పెట్టుకున్న ఆశలు అడియాసులుగా మిగిలే పరిస్థితి కనపడుతోంది. కాలువల మీద ఉండే షట్టర్‌ గేట్లకు గతంలో ఏ విధమైన రిపేర్లు చేయకపోవడంతో మరమ్మతులకు గురై సాగునీరు సక్రమంగా సరఫరా కాని పరిస్థితి నెలకొంది. నీరందక బీటలు వారుతున్న వరి చేలు చూడలేక ఇప్పటికే ఎకరాకు రూ.వేలల్లో పెట్టుబడి పెట్టి ఉన్న రైతులు వరిచేను ఎండిపోతుంటే స్థానికంగా బోర్లు అందుబాటులో ఉంటే గంటల లెక్కన డబ్బులు చెల్లించి వరిచేలకు నీరు తోడుతున్నారు. దీనివల్ల రైతుకు ఎకరాకు రూ.2000 నుంచి రూ.3000 అదనంగా పెట్టుబడి అవుతోంది. ప్రభుత్వం వారు వారబంది లెక్కన పది రోజులకు ఒకసారి ఆయకట్టుకు వంతులు లెక్క కేవలం 36 గంటల సమయం నీరు వదులుతుంటే కొంతమంది రైతులు కూడా నీరు పెట్టుకోలేక ఇప్పుడిప్పుడే ఈనుతున్న వరిచేలు పాడైపోతుంటే చూడలేక కన్నీరు మున్నీరు అవుతున్నారు. అధికారులకు కలిసి మా కాలువకు నీరు ఎప్పుడు వస్తుందంటే పది రోజులకు ఒకసారి వంతు, పలానా తేదీన వస్తుంది, రోజు పూట వస్తుంది, మరలా వేరే వాళ్ళకి నీరు అందించాలని సమాధానం చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తుత రబీ పంట ఒక లక్షా 72 వేల ఏకరాల్లో రైతులు వరి సాగు చేసారు. అధికారులు రబీ 2023-24, ఫసలీ-1433 సాగు ప్రారంభ దశలో ఈ పంటకు నీటి లభ్యత తక్కువగా ఉంది.డ్రైన్లలో క్రాస్‌ బండ్లు వేస్తూ లభించిన ప్రతి నీటి బొట్టును సాగునీటి కోసం వినియోగించాని చెప్పారు. అధిక దిగుబడులు సాధించే దిశగా రెవెన్యూ జలవనరులు వ్యవసాయ, డ్రైనేజీ శాఖల అధికారులు రైతు సంఘాలు రైతుల పటిష్ట సమన్వయ గ్రూపుగా ఏర్పడిన రబీ సాగు నుండి రైతులను గట్టెక్కించాలని అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి రైతులకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు అయ్యాయి. జిల్లాలో అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, అమలాపురం తదితర మండలాల్లో శివారు ప్రాంతాలకు నీరందక రైతులే ఇబ్బంది పడుతున్నారు.

➡️