24 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 22,2024 21:52
24 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ప్రజాశక్తి-అమలాపురంజిల్లాలో ఈ నెల 24 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ అడ్వాన్సుడ్‌ జనరల్‌ ఒకేషనల్‌ సప్లమెంటరీ పబ్లిక్‌ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని డిఆర్‌ఒ ఛాంబర్‌లో ఇంటర్మీడియట్‌ సప్లమెంటరీ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్‌ కేటగిరీలో 7,733 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని ఒకేషనల్‌కు సంబంధించి 1,015 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. 8,748 మంది విద్యార్థులకు జిల్లాలో 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అధికారులు సమన్వయంతో విజయవంతంగా పరీక్షలు నిర్వహించి సఫలీకతం చేయాలని ఆకాంక్షించారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం బెటర్మెంట్‌ పరీక్షలు, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష తప్పిన విద్యా ర్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5:30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 24 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జూన్‌ ఒకటో తేదీన లాంగ్వేజ్‌ పరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారి వి.సోమశేఖర్‌ రావు మాట్లాడుతూ ట్రాన్స్‌కో అధికారులు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని అంతరాయాలు ఏర్పడిన పక్షంలో విద్యార్థులు పూర్తిగా పరీక్షపై దృష్టి సారించలేక అసౌకర్యానికి గురవుతారని ఆయన స్పష్టం చేశారు. జిల్లా ఎడ్యుకేషన్‌ కమిటీ సభ్యులు పూర్తి సమన్వయంతో పరీక్షలను సజావుగా నిర్వహించాలని ఆయన సూచించారు. రవాణా శాఖ అధికారులు పరీక్షా తేదీల్లో పరీక్షా కేంద్రానికి హాజరయ్యే సమయంలో బస్సు రద్దీగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా విద్యార్థిని విద్యార్థులను బస్సు ఎక్కించుకుని పరీక్షా కేంద్రాల గమ్యస్థానాలకు చేర్చాలని ఆయన కోరారు. పోలీసు అధికారులు ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల తరలింపులో భద్రత కల్పించాలని కోరారు. చీప్‌ సూపరింటెండెంట్లు, సిబ్బంది విద్యార్థులను పరీక్షలు బాగా రాసే విధంగా ప్రోత్సహించాలన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను నిర్వహించాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఇన్విజిలేటర్లుగా ఉపాధ్యాయులను నియమించడానికి సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఇఒ ఎం.కమల కుమారి, డిఎం అండ్‌ హెచ్‌ఒ ఎం.దుర్గారావు దొర, పోలీస్‌ ఉన్నతాధికారులు, కమిటీ సభ్యులు మంగారావు పాల్గొన్నారు.

➡️