డిఎస్‌సిలో వికలాంగులకు పోస్టులు కేటాయించాలి

Jun 17,2024 23:14
డిఎస్‌సిలో వికలాంగులకు పోస్టులు కేటాయించాలి

ప్రజాశక్తి – ఆలమూరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మొట్టమొదటి సంతకంతో ప్రవేశపెట్టిన మెగా డిఎస్‌పిలో వికలాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని సామాజిక కార్యకర్త, ల్యాంప్‌ స్వచ్ఛంద సేవా సంస్థ కో ఆర్డినేటర్‌ బడుగు సుబ్బాయమ్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. గడచిన 24 ఏళ్ల నుచి ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలల్లో బోధన విషయంలో రాష్ట్రంలోని వికలాంగ్‌ విద్యార్థులు పడుతున్న అనేక ఇబ్బందులను చాలా దగ్గర నుంచి చూశానన్నారు. పాఠశాలలో వారి నిమిత్తం ప్రత్యేక పాధ్యాయులు ఎవరూ లేరని, వికలాంగ పిల్లలు సమ్మిళిత విద్యకు తగు సౌకర్యాలు లేక విద్యకు దూరమై, మానసిక ఇబ్బందులకు గురవుతూ విద్యా ప్రగతిని భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు. ఎన్‌ఇపి 2020 ప్రకారం ప్రతి పాఠశాలలో ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించవలసి ఉందన్నారు. కాబట్టి మెగా డిఎస్‌సిలో ప్రత్యేక పోస్టులను కేటాయించాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో వికలాంగ విద్యార్థులకు బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసిన వారవుతారని ఆమె సూచించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయుల ఫెడరేషన్‌ ద్వారా బడుగు మహిమ రావు, మల్లిడి సాయి లక్ష్మి, రవి ప్రసాద్‌ మంగళగిరిలోని ప్రజా దర్బార్‌లో విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను కలిసి వికలాంగ విద్యార్థుల సమస్యలను వివరించారు. వారి నిమిత్తం ప్రత్యేక పోస్టుల కోసం ఎదురు చూస్తున్నట్లు వారు కోరారు. దీనపై ఆయన సానుకూలంగా స్పందించి తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

➡️