వంటింట్లో ధరల ‘మంట’

Jun 17,2024 23:09
వంటింట్లో ధరల 'మంట'

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి కూరగాయల ధరలు కొండెక్కాయి. 50 శాతం ధరలు పెరిగడంతో సామాన్యులు కొనలేని స్థితికి చేరారు. ప్రస్తుత వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు అకాల వర్షాల కారణంగా కూరగాయలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో ధరల పెరుగుదల అనివార్యమైంది. ప్రస్తుతం అన్ని కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల నుంచి పెరుగుదలలో వ్యత్యాసం కనిపిస్తుంది. ఉత్పత్తి తగ్గిపోవడం, రవాణా నిలిచిపోవడం, కొందరు కత్రిమ కొరతను సష్టించటం కూడా కూరగాయల ధరలు పెరగటానికి కారణమవుతున్నాయి.పెరిగిన ధరలిలా…గత రెండు వారాల నుంచి ధరలు బాగా పెరిగాయి. వంకాయలు రూ.60 నుంచి రూ.100, బీర రూ.60 నుంచి రూ.100, బెండ రూ.40 నుంచి రూ.60, చిక్కుళ్ళు రూ.40 నుంచి రూ.80, దొండ రూ.40 నుంచి రూ.60, ఆనపకాయ రూ. 20 నుంచి రూ.40, క్యాబేజీ రూ. 30 నుంచి రూ.40, కాకర రూ.40 నుంచి రూ. 60, టమోటా రూ. 40 నుంచి రూ.60, బంగాళా రూ.30 నుంచి రూ.50, మునక్కాడ ఒకటి రూ.5 నుంచి 15, బీట్‌రూట్‌ రూ. 40 నుంచి రూ.70కి పెరిగాయి. ఒకపక్క ఎండలు మండుతుండగా మరోవైపు కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. డిమాండ్‌ పెరగడం, మార్కెట్లకు సరుకు అంతంతమాత్రంగానే వస్తుండడంతో ధరలన్నీ పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వీటి ప్రభావంతో వ్యాపారాలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయని వాపోతున్నారు. కొత్త పంట మార్కెట్‌ కు వచ్చే వరకూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని చెబుతున్నారు.మరింత పెరిగే అవకాశంరైతు బజారు నుంచి గల్లీ దుకాణాల వరకూ కూరగాయల ధరలు కాక పుట్టిస్తున్నాయి. దాదాపు అన్ని రకాల ధరలు మండిపోతున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తోటలు పాడవడంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఏ కూరగాయ రేటు చూసినా కిలో రూ.60 పైగానే ఉంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూరగాయలు కొనేందుకు జంకుతున్నారు. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కూరగాయలు లేకుండా పూట గడవని పరిస్థితిలో వాటి ధరలు ఆకాశాన్నంటడంతో కిలో కొనాలనుకున్న వారు అర కిలోతో సరిపెట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి.ఘాటెక్కిన ఉల్లి ధరలుశాఖాహారమైనా, మాంసాహారమైనా ప్రతి ఇంట్లో ఉల్లి తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. దీంతో ఉల్లికి డిమాండ్‌ బాగా పెరిగింది. మనకు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు నుంచే ఉల్లిపాయలు వస్తున్నాయి. ఇక్కడ రబీలో వేసి ఉల్లి పంటలు అకాల వర్షాలకు దెబ్బతిన్నాయి. దీంతో 50 శాతం వరకూ దిగుబడులు తగ్గిపోవడంతో ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. రెండు వారాల కిందట వరకూ కిలో రూ.20 నుంచి రూ.25 మధ్య ఉండగా ఒక్కసారిగా రూ.50కు చేరుకుంది. గ్రేడింగును బట్టి ధరలు నిర్ణయిస్తున్నారు. రెండో రకం ఉల్లి రూ.35 ఉండగా మొదటి రకం ధర రూ.50 వరకూ ఉంది. మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నాయి. అంగన్‌వాడీలపై అదనపు భారంప్రభుత్వ మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో నిత్యం ఉదయం అల్పాహారంగా ఉడికించిన కోడి గుడ్లు, సోమవారం నుంచి శనివారం వరకు అన్నం, పులిహోర, ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌, వెజిటబుల్‌ రైస్‌, దోసకాయ, టమోటా, ఆకుకూర, బీరకాయ, సొరకాయ, మునగాకు, పాలకూర, పప్పు కూరగాయలతోపాటు సాంబారు ఇవ్వాలి. బియ్యం, పప్పులు, ఆయిల్‌ ప్రభుత్వమే అంగన్‌వాడీ కంద్రాలకు సరఫరా చేస్తుంది. అయితే కూరగాయలు, తాలింపు సామాన్లు, గ్యాస్‌, రవాణా ఖర్చుల కోసం ఒక్కొక్కరికి ప్రభుత్వం కేవలం రూ.5.75 పైసలు మాత్రమే ఇస్తుంది. ప్రీ స్కూల్‌ పిల్లలకైతే రూ.3 మాత్రమే ఇస్తున్నారు. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అంగన్‌వాడీలపై అదనపు భారం తప్పడం లేదు. అందని పౌష్టికాహారం ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ఛార్జీలు సరిపోని పరిస్థితుల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. మరోవైపు కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో సంక్షేమ విద్యార్థులు మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పౌష్టికాహారం ప్రశ్నార్ధంకంగా మారింది. ప్రభుత్వం మెనూఛార్జీలను పెంచడం లేదు. మరో వైపు పెరిగిన ధరలతో కొందరు వార్డెన్లు సతమతమవుతున్నారు. కొన్నిచోట్ల చేసేదేమీ లేక కూరల్లో నాణ్యత తగ్గిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

➡️