యథేచ్ఛగా నీటి చౌర్యం

Apr 25,2024 23:15

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌

కంచె చేను మేసిన చందంగా నీటిపారుదల శాఖ అధికారులు పనితీరు తయారైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన కష్ణా జలాలు మచిలీపట్నం నియోజవర్గంలోని శివారు గ్రామాల వరకు మంచినీళ్లు రక్షిత మంచినీటి చెరువులకు నీరంధించాలన్న దృడ సంకల్పంతో గుక్కెడు నీటిని అందించడానికి ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. కానీ పర్యవేక్షించాల్సిన అధికారులే ఆమ్యమ్యాలకు అలవాటు పడి వెల కట్టలేని నీటిని కాసులకు కక్కుర్తి పడి బడా బాబుల చేపల, రొయ్యల చెరువులను సాగు చేసుకునేందుకు గేట్లు ఎత్తేశారు. ఇదంతా ఎక్కడో మారుమూల గ్రామం అయితే పరవాలేదు, సాక్షాత్తు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని ఈ దౌర్భాగ్య పరిస్థితి నెలకొనడం ఆయా శాఖల అధికారులు పనితీరు అద్దం పడుతుంది. రామరాజుపాలెం ఛానల్‌ నుంచి నాగులేరు మంచినీళ్లు కాలవకు నీరు సరఫరా జరుగుతుంది అయితే ఈ నీటిని ఈ కాల్వ నుంచి మెడికల్‌ కళాశాలకు, గరాలదిబ్బ గ్రామానికీ ఉపయోగించుకోవడానికి గల పది రోజులుగా నీటిని సరఫరా చేస్తున్నారు.బందరు వెస్ట్‌ గరాలదిబ్బ పరిధిలోని సైఫిన్‌ ద్వారా మురుగు కాలువ (బొబ్బిలి వాలు) ప్రక్కగా వున్న పంట కాలువలోకి తరలిస్తున్నారు. ఈ నీటిని ఇదే అదునుగా భావించిన కొందరు విద్యుత్‌ మోటార్లు, డీజిల్‌ ఇంజన్లతో తోడేస్తున్నారు.కొందరు రైతులు రాత్రి పూట నిర్విరామంగా తోడుతుంటే ఇంకొందరు కలువలపై తిరిగే లస్కరుల సహాయంతో పగలు కూడా యథేచ్చగా తోడుతున్నారు. ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ కాసులు పోగేస్తున్నారని కొందరు రైతులు తెలుపుతున్నారు. అయితే జిల్లా కలెక్టర్‌ డికే బాలాజీ నీటి చౌర్యం జరగకుండా చూడాలని పంచాయితీ, రవిన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో కమిటీలు కూడా వేశారు.కష్ణ జలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమంగా చెరువులకు తోడుకోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇదే అదును గా భావించిన క్రింది స్థాయి అధికారులు సిబ్బంది ఆమ్యమ్యాలకు పాల్పడి బడా బాబులు చెరువులకు నీటిని తోడుకునేందుకు తెరలేపారు.గ్రామాలలో నీరులేక అవస్థలు పడుతుంటే చేపల, రొయ్యల చెరువులకు నీటిని తోడుతున్న రైతులపై, ప్రోత్సహిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఇరిగేషన్‌ డిఇ మురళీ మాట్లాడుతూ నీటి చౌర్యం జరుగుతున్న విషయం తమ దృష్టికి రాలేదని, విచారించి సంబధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

➡️