ఎన్నికల్లో ప్రొసైడింగ్‌ అధికారుల పాత్ర కీలకం : కలెక్టర్‌

Apr 13,2024 23:12

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కష్ణా) : ఎన్నికలు నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించటంలో పోలింగ్‌, ప్రొసైడింగ్‌ అధికారుల పాత్ర కీలకమైనదని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. స్థానిక నోబుల్‌ కళాశాలలో శనివారం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మీలో చాలామందికి గత ఎన్నికలలో పనిచేసిన అనుభవం ఉందన్నారు. అయితే ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అప్డేట్‌ చేస్తూ ఇస్తున్న నియమావళి క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని ఎన్నికల విధుల నిర్వహణ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల విధులను సీరియస్‌గా తీసుకుని, ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా సక్రమంగా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రిసైడింగ్‌ అధికారులు, పోలింగ్‌ అధికారులు ఇవిఎంలు వివి పేట్లకు ఎలా కనెక్ట్‌ చేయాలి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. మాక్‌ పోలింగ్‌ నిర్వహణలో సంపూర్ణ దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే పోలింగ్‌ అధికారులు పాత్ర కీలకమైనదని అన్నారు. అవగాహన లేమితో ఏదైనా చిన్న పొరపాటు జరిగిన, వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తేవాలని కలెక్టర్‌ సూచించారు. తద్వారా సమస్య పరిష్కారానికి వీలవుతుందన్నారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి బందరు ఆర్డిఒ ఎం.వాణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

➡️