యావత్‌ ప్రపంచం యోగావైపు చూస్తుంది : మండలి బుద్ధప్రసాద్‌

Jun 21,2024 11:20 #Mandali Buddhaprasad, #speech, #yoga

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : యావత్‌ ప్రపంచం యోగా వైపు చూడటం భారతదేశం గర్వించదగ్గ విషయం అని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. శుక్రవారం ఉదయం చల్లపల్లిలోని ఎన్టీఆర్‌ గ్రామ పంచాయతీ పార్కులో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ యావత్‌ మానవాళికి భారతదేశం అందించిన మహౌన్నత యోగాను ఐక్య రాజ్య సమితి గుర్తించటం, 2014లో ప్రధాని మోడీ చొరవ మేరకు ప్రపంచ దేశాలు ప్రతి ఏటా జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవటం గర్వకారణం అన్నారు. శారీరక మానసిక వికాసం అందించే యోగా భారతదేశంలో వేద కాలం నుంచి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని, ముఖ్యంగా నేటితరం పిల్లలకు యోగా నేర్పించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సత్యసాయి ధ్యాన మండలి, లంకపల్లి సత్యసేవా యోగమండలి సంయుక్త ఆధ్వర్యంలో యోగా గురువు శ్రీనివాస్‌ నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్లు డాక్టర్‌ డీ.ఆర్‌.కే ప్రసాద్‌ – డాక్టర్‌ టీ.పద్మావతి, బిజెపి నియోజకవర్గ కో కన్వీనర్‌ తుంగల వెంకటగిరి, ఉప సర్పంచ్‌ ముమ్మనేని రాజకుమార్‌ (నాని), విశ్రాంత ఈఓఆర్డీ దాసి సీతారామరాజు, రంగస్థల పౌరాణిక కళాకారుడు బోలెం రామారావు, మాజీ వైస్‌ ఎంపీపీ బోలెం నాగమణి, రాయపాటి రాధాకృష్ణ, కైతేపల్లి దాస్‌, బుల్లా కిషోర్‌, పరిశే మౌళి, కోట పద్మావతి, కోడూరు వెంకటేశ్వరరావు, బీజేపీ మండల అధ్యక్షుడు రేవతి, పంచాయతీ ఈఓ పీవీ మాధవేంద్రరావు, శానిటరీ అధికారి పాల్గొన్నారు.

➡️