ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు : కలెక్టర్‌

Apr 17,2024 23:24

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)

కృష్ణాజిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు .కలెక్టర్‌ బుధవారం జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి, డిఆర్వో కె. చంద్రశేఖర రావులతో కలిసి కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024 సంబంధించి ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు తెలిపారు. 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు (ప్రభుత్వ సెలవు దినాలు మినహా) ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు.ఈనెల 26వ తేదీన నామినేషన్ల స్కూటీని, 29వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అన్నారు. మే 13వ తేదీన ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌, జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. పార్లమెంటుకు ఫారం-2 ఎ, అసెంబ్లీకి ఫారం-2 బి లో నామినేషన్లు దాఖలు చేయవలసి ఉంటుందని, ఫారం 26 లో అఫిడవిట్‌ సమర్పించాలని, అఫిడవిట్లో అన్ని కాలమ్స్‌ నింపాలని తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసే జనరల్‌ అభ్యర్థులు 25 వేలు, అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే జనరల్‌ అభ్యర్థులు పది వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పార్లమెంటుకు రూ.12,500, అసెంబ్లీకి రూ.5 వేలు డిపాజిట్‌ చెల్లించాలన్నారు. రిజర్వు నియోజకవర్గానికి పోటీ చేయు అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు కొత్తగా బ్యాంకు ఎకౌంటు తెరచి, వివరాలు సమర్పించాలని, అన్ని ఎన్నికల ఖర్చులు ఈ ఎకౌంటు ద్వారా చేయాలన్నారు.నామినేషన్‌ పత్రాలలో గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులు తమను బలపరిచే ఒకరి సంతకం, ఇతరులు, ఇండిపెండెంట్‌లు పది మంది బలపరిచే వారి సంతకాలు తప్పనిసరి అన్నారు.మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి కలెక్టరేట్లో రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ వారి చాంబర్‌, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి రిటర్నింగ్‌ అధికారి, బందర్‌ ఆర్డీవో కార్యాలయంలో, పెడన తాసిల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి వారి చాంబర్‌, అవనిగడ్డ తాసిల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి వారి చాంబర్‌, పామర్రు తాసిల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి వారి చాంబర్‌, పెనమలూరు తాసిల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి వారి చాంబర్‌, గన్నవరం తాసిల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి వారి చాంబర్‌, గుడివాడ ఆర్డిఓ కార్యాలయం రిటర్నింగ్‌ అధికారి వారి చాంబర్‌ లలో నామినేషన్లు దాఖలు చేయవచ్చు అన్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షించి, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా డి.ఎస్‌.పి. స్థాయిలో, మచిలీపట్నం పార్లమెంట్‌కి ఏఎస్పి స్థాయిలో పోలీసు అధికారులను నియమించినట్లు తెలిపారు. జిల్లాలో మూడు కంపెనీల కేంద్ర భద్రతా బలగాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో అదనపు భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

➡️