మోటార్ల ద్వారా తాగునీరు తరలింపు

Apr 23,2024 23:17

ప్రజాశక్తి-పెడన

వేసవి కాలంలో ప్రజలు దాహార్తి తీర్చేందుకు కెనాల్‌, ఛానళ్లు ద్వారా విడుదల చేసిన నీటిని మోటార్ల ద్వారా తరలిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నీటిని ఆయా మండలాల్లోని శివారు గ్రామాల వరకు ఉన్న మంచినీటి చెరువులకు నీటిని నింపేందుకు ప్రత్యేక ప్రణాళిక ఉన్నతాధికారి రూపొందించారు. చేపల, రొయ్యల చెరువులకు తోడకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ క్రింది స్థాయి అధికారులను ప్రత్యేక టీములుగా ఏర్పాటు చేసి పర్యవేక్షించాల్సిన బాధ్యతలు అప్పగించారు. అవకతవకలు అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆచరణలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. సాక్షాత్తు జిల్లా కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెడన మండలంలోని బంటుమిల్లి మెయిన్‌ కెనాల్‌ నుండి నిబంధనలకు తూట్లు పడుతున్న సంఘటన చోటు చేసుకోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుంది. సాక్షాత్తు ఆయా శాఖల అధికారులు అనుమతులతోనే నీటిని తోడుతున్నట్లు సిబ్బంది చెప్పడం గమనార్హం. పెడన మండలంలోని కమలాపురం నుంచి చెన్నూరు వెళుతుండగా బంటుమిల్లి మెయిన్‌ కెనాల్‌ నుంచి ఆర్‌ అండ్‌ బి రోడ్డు ఎడమవైపు ఉన్న భారీ చెరువులకు నాలుగు విద్యుత్‌ మోటార్లతో నీటిని తోడేస్తున్నారు. దాదాపు 5 నుంచి 15 ఎకరాల చెరువులకు ఇలా రేయింబవళ్లు మోటార్లతో నీటిని తోడుతున్నారు. అలాగే చెన్నూరు గ్రామంలోని మంచినీళ్ళ చెరువు ఆనుకుని ఉన్న రొయ్యల చెరువులకు ఆయిల్‌ ఇంజన్లతో ఈ నీటిని తోడేస్తున్నారు. అంతేకాకుండా చెన్నూరు నుంచి గొల్లగూడెం వెళ్లేదారిలో గ్రామంలోని ఓ బడా బాబుకు చెందిన రెండు రొయ్యల చెరువులకు విద్యుత్‌ మోటార్ల ద్వారా అంతేకాకుండా కొప్పల్లి పంచాయతీ రక్షిత మంచినీటి చెరువు గట్టునున్న సిమెంట్‌ రోడ్డు పక్కనే మూడు చేపల చెరువులకు గత ఐదు రోజులుగా అంతేకాకుండా కొప్పల్లి నుంచి ముచ్చలగుంట వెళ్లే మార్గంలో శ్మశాన వాటికి పక్కనే ఉన్న రొయ్యల చెరువులకు ఈ నీటిని యథేచ్చగా తోడేస్తున్నారు. ఇదంతా చూస్తున్న పంచాయతీ, రెవెన్యూ, సచివాలయ, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులు నిమ్మకు నిరుత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ స్థాయి సిబ్బంది నుంచి మండల స్థాయి అధికారుల వరకు వందలాది ఎకరాల్లో ఈ నీటిని తోడుకునేందుకు బడా బాబుల వద్ద నుంచి లక్షల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. అందువలన వారం రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్న వీటిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అమ్యమ్యాలే కారణమని ఆయా గ్రామాల్లోని ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా కెనాల్‌, ఛానల్‌ ద్వారా బడా బాబులు చేపలు, రొయ్యల చెరువులకు నీటి తోడుతున్న విషయాలపై నీటిపారుదల శాఖ ఏఈ సాధిక్‌ ను వివరణ కోరగా ఈ ఛానల్‌ తమ పరిధిలో లేదన్నారు. కెనాల్‌ క్లస్టర్‌ నాగభూషణంను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల తోనే నీటిని తోడుతున్నారని వివరణ ఇచ్చారు. బుధవారం సాయంత్రం వరకు మాత్రమే గడువు ఉందని అక్కడి నుంచి మోటర్లు, ఇంజన్లు నిలిపివేస్తామని చెప్పారు. అంతేకాకుండా చెన్నూరు సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ శ్రీకాంత్‌ ను వివరణ కోరగా తమ పరిధిలోని ఉన్న గ్రామాల్లో ఎక్కడ కూడా మంచినీటిని రొయ్యలు, చేపలు చెరువులకు తరలించడం లేదని బదులిచ్చారు.

➡️