పోస్టల్ బ్యాలెట్ ల తరలింపు

May 27,2024 15:29 #Krishna district

ప్రజాశక్తి-గన్నవరం :  రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు గన్నవరం నియోజకవర్గంలో పోలింగ్ దశలో పోలైన పోస్టల్, హోమ్ ఓటింగ్ బ్యాలెట్ పేపర్లను గన్నవరం నియోజకవర్గంలోని సబ్ ట్రెజరీలో బద్రపరచడం జరిగింది. సోమవారం ఉదయం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో సబ్ ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్ కు వేసిన సీల్ ను తొలగించి పోస్టల్ బ్యాలెట్ లు ఉంచిన బాక్సులను పూర్తి సెక్యూరిటీతో మచిలీపట్నంలోని కలక్టరేట్ లో ఉన్న జిల్లా ట్రెజరీకి తరలించారు. గన్నవరం నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, పోస్టల్ బ్యాలెట్ భాద్యులు ఉంగుటూరు మండలం తహశీల్దారు ఆద్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల ఏజెంట్లు గూడవల్లి నరసింహారావు (టి.డి.పి), ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు (ఆర్.పి.ఐ), ఆర్. వెంకటేశ్వరరావు (వైయస్సార్సీపి), గన్నవరం సబ్ ట్రెజరీ అధికారి, టి. నాగరాజు సమక్షంలో పూర్తి పారదర్శకతతో సబ్ ట్రెజరీను తెరచి మొత్తం మూడు బాక్సుల్లో ఉన్న పోస్టల్, హోమ్ ఓటింగ్ బ్యాలెట్‌ లను మచిలీపట్నం తరలించారు. ఈ సందర్భంగా ఉంగుటూరు తహశీల్దారు జె.వి సుబ్బారావు, మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో ఫెసిలిటేషన్ సెంటర్ లో 1580 పోస్టల్ బ్యాలెట్లు పోలైనవని బయట నియోజకవర్గం నుండి 852 పోస్టల్ బ్యాలెట్లు పోలవగా మొత్తం పోస్టల్ కు సంబందించి 2432 ఓట్లు పోలైనవని హోమ్ ఓటింగ్ కు సంబందించి 272 ఓట్లు పోలైనవని మొత్తం 2704 ఓట్లు ఉన్న బాక్సులను ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో మచిలీపట్నం కలక్టరేట్ లోని జిల్లా ట్రెజరీకి తరలిస్తున్నామని తెలిపారు. ఆర్వో గారి ఆదేశాల మేరకు కౌంటింగ్ రోజున ఉదయం జిల్లా ట్రెజరీ నుండి కృష్ణా యూనివర్సిటీలోని గన్నవరం అసెంబ్లీ కౌంటింగ్ హాలుకు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. అలాగే సర్వీసు ఓటర్లకు సంబందించి 73 మంది దరఖాస్తును సమర్పించారని ఇప్పటి వరకు 21 సర్వీసు ఓటర్లకు సంబందించి పోస్టు ద్వారా బ్యాలెట్ కవర్లు ఆర్వో కార్యాలయానికి అందాయని, కౌంటింగ్ ముందు రోజు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డిప్యూటి తహశీల్దారు ఎ.ఎస్.ఆర్ గోపాల్ రెడ్డి, గన్నవరం తహశీల్దారు ఎన్.ఎస్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

➡️