ఓట్ల లెక్కింపు కేంద్రంలో పటిష్ట ఏర్పాట్లు

Apr 12,2024 23:32
  • కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాలాజీ

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)

సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రంలో పటిష్టవంతమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. స్థానిక కృష్ణ విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు కేంద్రంలో చేయాల్సిన ఏర్పాట్ల గురించి శుక్రవారం కలెక్టర్‌ వారి ఛాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా పోలింగ్‌ అనంతరం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోలైన ఓట్లతో కూడిన ఈవీఎంలు కౌంటింగ్‌ కేంద్రానికి తరలించి భద్రపరుచుటకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పోలింగ్‌ అనంతరం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూములలో భద్రపరచుటకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వేరువేరు మార్గాలు ఏర్పాటు చేస్తూ అవసరమైన బార్కేడింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ కె.చంద్రశేఖరరావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ విజయకుమారి, డ్వామా పీడీ జివి సూర్యనారాయణ, ఆర్‌అండ్‌బి ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.విజిలెన్స్‌ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాలిఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా జరిగేందుకు విజిలెన్స్‌ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్‌ శుక్రవారం కలెక్టరేట్‌లో తమ ఛాంబర్‌ లో ఎక్సైజ్‌, స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్‌ బ్యూరో అధికారులు, జిల్లా ఎన్నికల వ్యయ పర్యవేక్షణ కమిటీలతో సమావేశం నిర్వహించి ఇప్పటివరకు విజిలెన్స్‌ బందాలు తీసుకున్న చర్యలు సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని గణనీయంగా తగ్గించి ఎన్నికలు సజావుగా పారదర్శకంగా జరిగేందుకు విజిలెన్స్‌ బృందాలు తనిఖీలు విస్తతం చేయాలన్నారు. మద్యం అక్రమ రవాణా, బెల్ట్‌ షాపులు అరికట్టుటకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ తేదీకి 48 గంటల ముందు డ్రైడేగా పాటిస్తూ షాపులు మూసి ఉంచాలని, మద్యం సరఫరా కూడా వారం ముందుగానే తగ్గించాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపర్నెంట్‌ అవులయ్య, ఎన్నికల వ్యయ నోడల్‌ అధికారి కె భాస్కరరావు, కమిటీ సభ్యులు జడ్పీ సీఈఓ ఆనంద్‌ కుమార్‌, డిడి ట్రెజరీస్‌ ఎస్‌.రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️