అంగన్వాడీలపై ‘ఎస్మా’ ప్రయోగం మూర్ఖత్వం

Jan 6,2024 19:58

మంత్రాలయంలో మాట్లాడుతున్న అంజిబాబు

– సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు
ప్రజాశక్తి – మంత్రాలయం
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించలేని వైసిపి ప్రభుత్వం వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం మూర్ఖత్వమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.అంజిబాబు విమర్శించారు. శనివారం పట్టణంలోని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం నుంచి మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం వరకు ర్యాలీతో ప్రదర్శన నిర్వహించారు. ఎంపిపి గిరిజమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. వెంటనే చర్చలు జరిపి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలని, వారి సేవలకు గుర్తింపుగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలని కోరారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంగన్వాడీల సమస్యలను పరిష్కరించలేక జిఒ 33 తెచ్చి ఎస్మా చట్టం కింద సమ్మె చెల్లదని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. నీరు, పాలు, విద్యుత్‌ లాంటివి వాటికి మాత్రమే ఎస్మా చట్టం వర్తిస్తుందని, అంగన్వాడీలు చేస్తున్న సేవలకు అది వర్తించదని చెప్పారు. ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెను ఎంత విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తే అంత ఉధృతంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరారు. వైసిపి మండల ఇన్‌ఛార్జీ విశ్వనాథరెడ్డి, వైస్‌ ఎంపిపి పులికుక్క రాఘవేంద్ర, సర్పంచి భీమయ్య, 52 బసాపురం సర్పంచి రాఘవరెడ్డి, ఎంపిడిఒ మణిమంజరి, సిఐటియు మండల కార్యదర్శి హెచ్‌.జయరాజు, నాయకులు ప్రాణేష్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు విశాలాక్షి, భీమేశ్వరి, ద్రాక్షాయిని, ఉమా మహేశ్వరి, సుజాత, ప్రమీల, లావణ్య ఉన్నారు. ఆదోనిలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద వరలక్ష్మి అధ్యక్షతన రిలే దీక్షలు చేపట్టారు. సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, పిఎస్‌.గోపాల్‌, మండల అధ్యక్షులు రామాంజనేయులు, ఎఐటియుసి నాయకులు వీరేష్‌, విజరు మాట్లాడారు. దీక్షల్లో పద్మమ్మ, ధనలక్ష్మి, సోమక్క, కరుణ, రేణుక, జానకి, విజయ, ఈరమ్మ కూర్చున్నారు. అంగన్వాడీలు సరోజ, గీత, మీనా కుమారి, రిజ్వానా, సోమేశ్వరి, శారద పాల్గొన్నారు. ఆలూరులో 26వ రోజు అంగన్వాడీలు తమ చెప్పులతో తామే కొట్టుకుంటూ నిరసన చేపట్టారు. ‘ముఖ్యమంత్రి జగన్‌కు ఓట్లు వేసి గెలిపించినందుకు మా చెప్పులతో మేమే కొట్టుకుంటున్నామ’ని అంగన్వాడీ యూనియన్‌ నాయకులు జయశ్రీ, భారతి, పుష్పవతి ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి సిపిఎం నాయకులు కెపి.నారాయణస్వామి, షాకీర్‌, కృష్ణ, డివైఎఫ్‌ఐ నాయకులు మైనా, రైతుసంఘం నాయకులు వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు. అంగన్వాడీ నాయకులు లక్ష్మీ, సరస్వతి, ప్రభావతి, సుజాత, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఆస్పరిలో అంగన్వాడీ సమ్మెలో పాల్గొని సిఐటియు జిల్లా సీనియర్‌ నాయకులు బి.రామాంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి కెపి.నారాయణస్వామి మాట్లాడారు. సిపిఎం ఆలూరు మండల కార్యదర్శి షాకీర్‌ బాషా, మల్లేష్‌ మద్దతు తెలిపారు. సిపిఎం మండల కార్యదర్శి హనుమంతు, సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి, సిపిఎం, సిపిఐ ప్రజాసంఘాల నాయకులు రంగస్వామి, సిఐటియు మండల కార్యదర్శి రామాంజనేయులు, నరేంద్ర, రామాంజనేయులు, రవి, ఆంజనేయ, ఉరుకుందప్ప పాల్గొన్నారు. ఎమ్మిగనూరులోని అంగన్వాడీ కేంద్రం ముందు ప్రభుత్వం జారీ చేసిన ఎస్మా చట్టం జిఒను దహనం చేశారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు గోవర్ధనమ్మ, నీరజ, బసమ్మ, శిరోమణి, నాగలక్ష్మి, సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు సి.గోవిందు, బి.రాముడు, ఎఐటియుసి డివిజన్‌ నాయకులు తిమ్మ గురుడు, రంగన్న మాట్లాడారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు అబ్దుల్లా, కార్యదర్శి రంగప్ప, రైతుసంఘం నాయకులు సి.నరసింహులు మద్దతు ఇచ్చారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కృష్ణ వేణి, నాగేశ్వరమ్మ, నీరజ, శైలజ, యుఎం.నాగలక్ష్మి, మల్లీశ్వరి, పుష్ప, పద్మలత, మేరీ, ప్రభావతి, శశికళ, ధన లక్ష్మి, సమంతకమణి, లక్ష్మి దేవి పాల్గొన్నారు. దేవనకొండ మండలంలోని తెర్నేకల్లు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడానికి డీలర్లు ప్రయత్నించగా అంగన్వాడలు అడ్డుకున్నారు. మండలంలోని పి.కోటకొండ గ్రామంలో అంగన్వాడీలు సచివాలయాన్ని ముట్టడించి తాళాలు వేశారు. దేవనకొండలో రెండు రోజులుగా ఆర్‌టిసి బస్టాండ్‌లో సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు.

➡️