డీఎస్సీ విడుదల చేయమంటే అక్రమ అరెస్టులు సిగ్గు చేటు

Jan 10,2024 20:38

అంబేద్కర్‌ సర్కిల్‌లో నిరసన తెలుపుతున్న డివైఎఫ్‌ఐ నాయకులు

– డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి మైనా
ప్రజాశక్తి-ఆలూరు
మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని సిఎం కార్యాలయం ముట్టడికి వెళ్లిన నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గు చేటని డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి మైనా విమర్శించారు. బుధవారం అక్రమ అరెస్టులపై ఆలూరు అంబేద్కర్‌ సర్కిల్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పి మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థులు అనేకసార్లు నిరసనలు, ప్రదర్శనలు, ధర్నాలు చేసినా స్పందించకపోవడంతో 3న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించినట్లు తెలిపారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ‘చలో సిఎం కార్యాలయం ముట్టడి’ చేపట్టినట్లు చెప్పారు. ముట్టడికి వెళ్లిన నిరుద్యోగులను, డివైఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెగా డీఎస్సీని విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు సంయుక్త, మండల అధ్యక్షులు గిరిమూర్తి మద్దతు తెలిపారు. డివైఎఫ్‌ఐ నాయకులు నరసింహ, నాగప్ప, ధనుంజరు, మల్లి పాల్గొన్నారు. దేవనకొండలో డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి కె.శ్రీనివాసులు మాట్లాడారు. మండల సహాయ కార్యదర్శి పి.రసూల్‌, నాయకులు రంగస్వామి, వీరేంద్ర, వీరప్ప, మురళీ, సూర్యచంద్ర పాల్గొన్నారు. ఎమ్మిగనూరులో డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్‌ కుమార్‌ మాట్లాడారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేస్తూ మెగా డీఎస్సీని ప్రకటించి, జాబ్‌ కాలెండర్‌ను విడుదల చేయాలని కోరారు.

➡️