రైతుల సౌకర్యార్థం ఎసి గోడౌన్ల నిర్మాణం

Jan 29,2024 19:45

నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న విజయ మనోహరి

– కెడిసిసి బ్యాంకు ఛైర్మన్‌ విజయ మనోహరి
ప్రజాశక్తి – హోళగుంద
రైతుల సౌకర్యార్థం ఎసి గోడౌన్ల నిర్మాణానికి కృషి చేస్తానని కెడిసిసి బ్యాంకు ఛైర్మన్‌ విజయ మనోహరి తెలిపారు. సోమవారం హోళగుంద ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన భవనాన్ని ఆమె ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్‌ మల్లికార్జున చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నీలకంఠ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విజయ మనోహరి మాట్లాడారు. 1921న చిన్నగా ప్రారంభమైన ఈ సంఘం ఈరోజు పెద్ద వృక్షంలా మారి ప్రతి రైతుకూ రుణాల రూపంలో ఫలాలను ఇస్తూ ఉన్నత స్థితికి చేరిందని తెలిపారు. నేడు సొంత భవనం నిర్మించుకోవడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో రైతుల మేలు కోసం, రైతుల పంటలు పాడవకుండా ఉండేందుకు ఎసి గోడౌన్ల నిర్మాణం చేపట్టి ఆదుకుంటామని చెప్పారు. రైతులకు తమ బ్యాంకు ద్వారా త్వరలో బంగారుపై కూడా రుణాల అందించేందుకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు పొందాలని సూచించారు. జడ్‌పి వైస్‌ ఛైర్మన్‌ బొజ్జమ్మ, పిఎసిఎస్‌ డైరెక్టర్లు సహారా భాను, బి.లక్ష్మి, కెడిసిసి మేనేజర్‌ ఆలూరు రవి ప్రకాష్‌, కర్నూలు డిసిఒ ఎన్‌.రామాంజనేయులు, కర్నూలు సిఇఒ పి.రామాంజనేయులు, జిఎం విజయకుమార్‌, సర్పంచి రంగమ్మ తనయుడు పంపాపతి, హోళగుంద ఎంపిపి నూర్జాన్‌బీ తనయుడు ఈసా, వైసిపి మండల కన్వీనర్‌ సెఫుల్లా, ఎఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️