వైకుంఠ ద్వారం ద్వారా శ్రీనివాసుని దర్శించుకున్న పీఠాధిపతులు

Dec 23,2023 19:42

ఆలయంలో ఉన్న డిఐజి వెంకటేశ్వర్లు

– ఘనంగా వైకుంఠ ఏకాదశి పూజలు
ప్రజాశక్తి – మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీరాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశించి శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీనివాసుని దర్శించుకున్నారు. శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్థానిక పాత ఊరులో వెలసిన వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీమఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థుల ఆదేశాల మేరకు శ్రీమఠం ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ వివిధ పుష్పాలతో, విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా పుష్పాలతో వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. పీఠాధిపతులు వైకుంఠ ద్వారానికి మంగళ హారతులు ఇచ్చి ప్రారంభించి, ఆ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకున్నారు. కనులవిందుగా కనిపించిన వైకుంఠ ద్వారం ద్వారా గ్రామస్తులు, భక్తులు శ్రీనివాసుని దర్శించుకున్నారు. రాఘవేంద్రుని దర్శించుకున్న డిఐజి వెంకటేశ్వర్లుమంత్రాలయంలో కొలువైన శ్రీరాఘవేంద్ర స్వామిని బెటాలియన్‌ డిఐజి సిహెచ్‌.వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం చేరుకున్న ఆయనకు శ్రీమఠం ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యాలయ సిబ్బంది బిందు మాధవాచార్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రుని మూల బృందావనాన్ని దర్శించుకుని మంగళ హారతులు స్వీకరించారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు ఆయనకు శేష వస్త్రం అందజేశారు. ఎస్‌ఐ వేణుగోపాల్‌ రాజు ఆధ్వర్యంలో సిబ్బందితో తగిన భద్రత ఏర్పాటు చేశారు.

➡️