కార్యకర్తల కృషి అభినందనీయం

May 16,2024 21:05 #cpm, #karnool, #MA Gafoor, #P Madhu
  •  సిపిఎం నేతలు గఫూర్‌, మధు

ప్రజాశక్తి – కర్నూలు హాస్పిటల్‌ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సిపిఎం అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ అహర్నిశలు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ. గఫూర్‌, సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అభినందనలు తెలిపారు. కార్యకర్తల అభినందన సభను నగరంలోని కల్లూరు హంద్రీ బ్రిడ్జి పక్కనున్న రావూరి గార్డెన్స్‌లో సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన నిర్వహించారు. ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ.. పాణ్యం నియోజకవర్గ పరిధిలో బలమైన వామపక్ష ఐక్యత కొనసాగిందన్నారు. గత 25 సంవత్సరాల నుంచి కర్నూలు అసెంబ్లీ పరిధిలో పోటీ చేస్తూ వచ్చామని తెలిపారు. ఇండియా వేదిక ఐక్యతను కాపాడడంతో పాటు గెలుపు కూడా ముఖ్యమని భావించి కర్నూలు నుంచి పాణ్యంకు మారాల్సి వచ్చిందన్నారు. అత్యంత తక్కువ సమయమే అయినా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేశారని గుర్తు చేశారు. పార్టీ గెలుపు కోసం ఎర్రని ఎండను సైతం లెక్కచేయకుండా ప్రతి నిమిషం విలువైనదే అంటూ కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. మధు మాట్లాడుతూ..ఈ ఎన్నికలు పార్టీ ప్రచారంతో పాటు నిర్మాణయుతంగా బలపడటానికి మరింత తోడ్పడ్డాయని తెలిపారు. మతోన్మాద బిజెపిని, ఆ పార్టీతో అంటకాగుతున్న టిడిపి, జనసేనలను, నియంతృత్వ వైసిపిని ఓడించాలనే లక్ష్యంలో భాగంగా ఇండియా వేదికతో కలిసి పోటీ చేశామన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి, పాణ్యం అసెంబ్లీ అభ్యర్థి డి. గౌస్‌ దేశాయి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి. నిర్మల, సిపిఐ కర్నూలు నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. చాలా తక్కువ సమయం ఉన్నా, 20 రోజుల్లోనే నియోజకవర్గం మొత్తం ప్రచారం నిర్వహించిన ప్రతి సభ్యుడికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రచారంలో వాముపక్షాల ఐక్యత బలంగా కొనసాగడంతో పాటు, కార్మిక వర్గం అక్కున చేర్చుకొని ప్రచారం నిర్వహించిందన్నారు.

➡️