దోమల నివారణ చేపట్టకపోతే దిగ్భంధనం చేస్తాం

Jan 29,2024 17:45 #Kurnool
cpm protest for mosquito problem krnl

మున్సిపల్ అధికారులకు సిపిఎం నాయకుల హెచ్చరిక

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు నగరంలో దోమల నివారణ చేపట్టకపోతే నగరపాలక సంస్థను దిగ్భంధనం చేస్తాం అని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. సోమవారం సిపిఎం పార్టీ నగర కమిటీల ఆధ్వర్యంలో దోమల నివారణ చేపట్టాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ముందు గంటసేపు బైటాయించారు. ఎంతసేపటికి అధికారులు బైటికి రాకపోవడంతో ప్రజలు లోపటికి గేటు వరకు వెళ్లి కమిషనర్ బయటికి రావాలని పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ దోమలు ప్రజలపై స్వైర విహారం చేస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు తూ తూ మంత్రంగా చర్యలు చేపట్టడం దుర్మార్గమైన చర్య అని వారు ఘాటుగా విమర్శించారు. ఖానా ఖజానా, పై ఉన్న శ్రద్ధ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురించి ఆలోచించే సమయం లేదని వారు ఎద్దేవా చేశారు. గత 40 సంవత్సరాల చరిత్రలో ప్రజలు నిద్రాహారాలు మానుకునేలా చేశారని వారు తెలిపారు. ప్రజలు రాత్రిపూట ఎలా నిద్రపోవాలో, ఈరోజు జాగరణ చేయాల్సిన పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్నారని వారు తెలిపారు. ఎవరికి చెప్పినా నగరపాలక సంస్థలో వినే నాథుడే కరువయ్యారని ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి గతంలో నగర ప్రజలు ఎప్పుడూ ఎరగని వారు విమర్శించారు. ప్రజల్లో పత్రికల్లో వివిధ రూపాల్లో వార్తలు వచ్చినపుడు మాత్రం తూతూ మంత్రంగా పిచికారిమందు చల్లి చేతులు దులుపుకునే పరిస్థితి నగరపాలక సంస్థ అధికారులు ఉందని వారు తెలిపారు. నగరంలో దోమలు ఎందుకు ఇంత విపరీతంగా పెరుగుతున్నాయి, ఎక్కడి నుండి వస్తున్నాయి, వాటి నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని కనీస ఆలోచన కూడా అధికారులకు లేకపోవడం బాధాకరమని వారు విమర్శించారు. మున్సిపల్ అధికారులకు చెత్త పన్ను ఇంటి పన్ను వసూలు చేయడం పట్ల ఉన్న శ్రద్ధ నగర ప్రజలను ఆరోగ్యకరంగా ఉంచడంలో వారు తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులు తీరు ఇలా ఉంటే పాలకమండలి తీరు ఇంకా దుర్మార్గంగా ఉందని వారు విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, మేయర్ అధికార పార్టీకి చెందిన వారే అయినప్పటికీ ఓట్లు సీట్ల పైన ఉన్న శ్రద్ధ నగర ప్రజల ఆరోగ్యాల పట్ల శ్రద్ద లేదని వారు తెలిపారు. వీరందరూ ఏం చేస్తున్నారు? ప్రజలకు సమాధానం చెప్పాలని వారు నిలదీశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో బయటకు వచ్చి వినతి పత్రాన్ని తీసుకున్నారు. కమిషనర్ కు నాయకులు హంద్రీ, కేసీ కెనాల్ ను తక్షణమే చెత్త చదారాన్ని తొలగించి నీటిని శుభ్రం చేసి, దోమల గుడ్డు చనిపోయేలా మందులను పిచికారి చేయాలని వారు కోరారు. హైపో ద్రావణాన్ని వదలాలని, నగరంలో వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రాంతంలో నీటి నిలిచిన చోట హైపోబాల్స్ లను వదలాలని, తుంగభద్ర నదిలో దోమల ఉత్పత్తి కాకుండా చర్యలు చేపట్టాలని, నగరంలో పారిశుద్ధ కార్మికుల సంఖ్య పెరిగి పెంచి రోజువారీగా మురికి కాలువలను శుభ్రం చేయాలని వారు కమిషనర్ ను కోరారు. అలాగే ప్రతి వార్డులో రోజు వాకింగ్ మిషన్ ద్వారా పొగను వదలాలని వారు డిమాండ్ చేశారు. అందుకు స్పందించిన కమిషనర్ వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని దోమల నివారణకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాధాకృష్ణ, ఆనంద్ బాబు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు అలివేలమ్మ, గురు శేఖర్, నగేష్, సిపిఎం నగర నాయకులు సుధాకరప్ప, సాయి బాబా, నరసింహులు, విజయ్, షరీఫ్, అబ్దుల్లా, రామకృష్ణ వివిధ ప్రాంతాల్లోని ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

➡️