కెవిపిఎస్, ఆర్ వి ఎస్ ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం 

May 27,2024 17:16 #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : సమాజ మార్పుకు కులాంతర వివాహాలే చోదక శక్తిగా ఉపయోగపడతాయని, నిచ్చెన మెట్ల లాంటి భారత కుల వ్యవస్థను బద్దలు కొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందని, ఆదర్శ వివాహానికి హాజరైన అతిధులు తెలియజేశారు. సోమవారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యాలయం లో ఆ సంఘం జిల్లా కార్యదర్శి సి. గురుశేఖర్ అధ్యక్షతన ఆదర్శ వివాహం జరిపించారు.కర్నూల్ నగరం, కృష్ణారెడ్డి నగర్ కు చెందిన చాకలి వినయ్, నంద్యాల జిల్లా డోన్ మండలం ధర్మవరం గ్రామానికి చెందిన రాచపోగుల ఎరిష లతో సాంప్రదాయ ఆచారాలకు భిన్నంగా ఆదర్శ వివాహానికి సంబందించిన ప్రమాణ పత్రాలను కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి ఆనంద్ బాబు వారితో చదివించి దండలు మార్పించి పెళ్లి తంతు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ భారతదేశంలోనే ఉందని, దాన్ని బద్దలు కొట్టాల్సిన భాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిబాపూలే, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లాంటివారు కోరుకున్నారన్నారు. భారత సమాజం కులాల వారిగా విభజించబడి, అంతరాలతో కునారిల్లుతోందన్నారు. ఈ అంతరాల దొంతరలను తొలగించేందుకు కంచం పొత్తు, మంచం పొత్తే దోహధపడతాయని కోరుకున్న అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడంలో భాగంగా ఆదర్శ వివాహం చేసుకుంటున్న నూతన దంపతులకు, కులాన్ని అధిగమించి తమ పిల్లలకు ఆదర్శ వివాహం జరుపుతున్న తల్లిదండ్రులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదర్శ వివాహ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, ప్రజాశక్తి జనరల్ మేనేజర్ టి నరసింహ, యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్ కుమార్, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వై .నగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం. రంగప్ప, ఎస్. అబ్దుల్లా కెవిపిఎస్ జిల్లా నాయకులు ఎన్. జి. కృష్ణ, ఆండ్రా. గురుస్వామి, గిత్తరి రమేష్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు శ్రీనివాసులు, రాముడు, శేషాద్రి, జయమ్మ, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సి. సాయి ఉదయ్ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పెళ్లి కుమారుడు వినయ్ తల్లిదండ్రులు ఉరుకుందమ్మ, తిప్పన్న, అన్న వీరేష్, పెళ్లి కుమార్తె ఎరీష తల్లిదండ్రులు దీవమ్మ, క్రిస్టఫర్, మేనమామ లక్ష్మణ్ కుమార్, తాత బజారయ్య, పెద్దలు మద్దిలేటి, రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.

➡️