v

Jan 10,2024 20:41

ఆందోళనకు దిగిన బంధువులు

– ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
ప్రజాశక్తి – ఆదోని
వైద్యం వికటించి నవజాత శిశువు మృతి చెందిన సంఘటన బుధవారం ఆదోనిలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బంధువులు ఎస్‌కెడి కాలనీలోని ప్రయివేట్‌ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బంధువుల వివరాల మేరకు… ఆదోనిలోని బోయగేరికి చెందిన గర్భిణి బోయ మహాలక్ష్మికి పెయిన్‌లెస్‌ డెలివరీ చేస్తామని, ఇంకా వారం రోజులు సమయం ఉన్నప్పటికీ మంగళవారం రాత్రి డెలివరీ చేయడానికి ఆస్పత్రి వైద్యులు సిద్ధమయ్యారు. సాయంత్రం 6 గంటల నుంచి మొదలుపెట్టిన చికిత్స రాత్రి 10 గంటలైనప్పటికీ ఎలాంటి సమాచారమూ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యాన్ని, వారి సిబ్బందిని గట్టిగా నిలదీశారు. చేసేదేం లేక చికిత్స సమయంలో బిడ్డ చనిపోయిందని వైద్యులు చేతులెత్తేశారు. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. 7 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చి పండంటి మగ బిడ్డకు జన్మనిస్తే వైద్యులు పురిటిలోనే పిండేశారని ఒక్కసారి రోదనలు ఆకాశాన్నంటాయి. ఇలాంటి ఘటనలు పట్టణంలో పదే పదే జరుగుతున్నా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణ కొరవడిందని, మిడిమిడి జ్ఞానంతో, అనుభవం లేని వైద్యుల వల్లే ఘటనలు పునరావృతం అవుతున్నాయని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పట్టణంలో నర్సింగ్‌ హోమ్‌లకు సరైన అనుమతులు లేకపోగా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి హద్దులు దాటుతున్నాయి.

➡️