ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం : ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

ప్రజాశక్తి- నారాయణవనం (తిరుపతి) : ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి దాని ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకుందామని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిములం అన్నారు. ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న ఎస్సీ పేద రైతులకు సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ప్లాస్టిక్‌ పట్టలు, డ్రమ్ములు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ … ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకృతి వ్యవసాయంను ప్రోత్సహించటమే లక్ష్యంగా పలు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రసాయనిక ఎరువుల వాడకం వలన ఆరోగ్యానికి హానికరం కలుగుతుండటంతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా లభ్యమయ్యే ఆకులు, అలుములు పశువుల మూత్రం, పేడ, పుల్లటి మజ్జిగ, బెల్లం, మిరపకాయలు వంటి వాటితో ఘన, ద్రవ బీజామృత, జీవామృతాలను, కషాయాలను పెద్ద మొత్తంలో తయారు చేయడానికి డ్రమ్ములను ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. పండించే పంటలను నాణ్యతగా నూర్పిడి చేసుకోవడానికి ప్లాస్టిక్‌ పట్టలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే కూరగాయలకు గాని, ధాన్యాలకు గానీ మంచి డిమాండ్‌ ఉన్నట్లు చెప్పారు.వీటి ద్వ్షరా అధిక ధరలు కూడా పొందవచ్చు అన్నారు. రైతులు రసాయనిక ఎరువుల వాడకం నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని కోరారు.ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి అవసరమయ్యే సహాయ సహకారాలు అందించటానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా పథక మేనేజర్‌ షణ్ముగం, వ్యవసాయ అధికారిణి. నీలిమ ,అదనపు ప్రాజెక్టు ప్రకృతి వ్యవసాయం సిబ్బందిలు , ఎంపీడీవో కృష్ణమూర్తి. పంచాయతీ కార్యదర్శి షణ్ముఖం. అగ్రికల్చరల్‌ అధికారిని సుభాషిని. మండల స్థాయి అధికారులు, పలువురు ప్రకృతి వ్యవసాయ రైతులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️