టిడిపి జెండా ఎగరేద్దాం: కొండయ్య

ప్రజాశక్తి-చీరాల: తెలుగుదేశం పార్టీకి చీరాల కంచుకోట అని, చీరాలలో టిడిపి జెండా ఎగరవేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని టిడిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య అన్నారు. గురువారం టిడిపి అభ్యర్థి కొండయ్య నామినేషన్‌ సందర్భంగా మండలంలోని హస్తినాపురం వినాయకుని గుడి వద్ద నుంచి ఏర్పాటు చేసిన నామినేషన్‌ ర్యాలీకు విశేష స్పందన కనిపించింది. దీంతో చీరాల ప్రాంతంలోనే పలు ప్రధాన రహదారులన్నీ పసుపుమయం అయ్యాయి. హస్తినాపురం, సాల్మన్‌ సెంటర్‌, ముంతవారిసెంటర్‌, మీదగా గడియార స్తంభం సెంటర్‌ కు చేరుకొని అక్కడ నుంచి అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ వెంటనే ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గడియార స్తంభం సెంటర్లో ఎంఎం కొండయ్య మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆదరణ చూస్తుంటే గెలుపు కళ్లముందే కనిపిస్తోందని అన్నారు. నామినేషన్‌ ర్యాలీకి టిడిపి అభ్యర్థి కొండయ్య కోడలుకు అన్నయ్య అయిన ప్రముఖ సినీ హీరో నిఖిల్‌ ప్రత్యేక అతిథిగా హాజరై నామినేషన్‌ ర్యాలీలో పాల్గొన్నారు. అదే విధంగా మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు, ఎమ్మెల్సీ, నియోజకవర్గ పరిశీలకురాలు పంచుమర్తి అనురాధ, డాక్టర్‌ సజ్జా హేమలత, సజ్జా వెంకటేశ్వర్లుతో కలిసి వెళ్లి నామినేషన్‌కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో స్థానిక గడియారం సెంటర్లో మండేఎండలను సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు, పవన్‌ అభిమానులు హాజరై నామినేషన్‌ ర్యాలీని విజయవంతం చేశారు. మేళ తాళాలతో, బాణసంచాతో కొండయ్యకు గడియారం సెంటర్లో ఘన స్వాగతం పలుకుతూ క్రేన్‌తో పూల దండలు వేశారు. గడియారం స్థంభం సెంటర్లో కొండయ్య మాట్లాడిన అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి స్థానిక ఆర్డిఓ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్లను దాఖలు చేశారు. కొండయ్య నామినేషన్‌ ర్యాలీలో, ఎమ్మెల్సీ, నియోజకవర్గ పరిశీలకురాలు పంచుమర్తి అనురాధ, మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు, డాక్టర్‌ సజ్జా హేమలత, సజ్జా వెంకటేశ్వర్లు, అధిక సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.

➡️