స్థానిక సమస్యల ఊసేది?

Apr 21,2024 22:14

ప్రజాశక్తి-పాలకొండ : ప్రస్తుత ఎన్నికల ప్రచారం ప్రధాన పార్టీల అభ్యర్థులు స్థానిక సమస్యలపై కనీసం ప్రస్తావించడం లేదు. వైసిపి ఎమ్మెల్యే వి.కళావతితో పాటు జనసేన అభ్యర్థిగా ఉన్న నిమ్మక జయకృష్ణ, ఇతర అభ్యర్థులు స్థానిక సమస్యలపై మాట్లాడుతున్న దాఖలాల్లేవు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమం చూసి ఓటు వేయాలని వైసిపి అభ్యర్థి కోరుతుండగా, జనసేన అభ్యర్థి జయకృష్ణ తమ మేనిఫెస్టోతో ప్రచారం చేస్తున్నారు. అంతే తప్ప స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని గానీ, ఈప్రాంత అభివృద్ధికి ఏం చేస్తామో అన్నదీ ప్రకటించకపోవడం పట్ల స్థానికులు పెద్దఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానిక సమస్యలపై ఎక్కడా కూడా పెదవి విప్పడం లేదు. నియోజకవర్గంలో ప్రధానంగా తోటపల్లి ఎడమ కాలువ, జంపరకోట జలాశయం పనులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉంది. అలాగే నియోజకవర్గంలో విద్యార్థుల ఉన్నత చదువుల కోసం పిజి కళాశాల, ఇంజినీరింగ్‌ కాలేజీలు లేవు. నియోజకవర్గ కేంద్రంలో కనీసం ఐటిఐ కళాశాల కూడా లేదు. పట్టణంలో డంపింగ్‌ యార్డ్‌ సమస్య తీవ్రంగా ఉంది. ప్రస్తుత డంపింగ్‌ యార్డ్‌ వల్ల పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలానే పట్టణంలో రైతు బజార్‌, మెయిన్‌ రోడ్డు విస్తరణ, ఇంటింటికి తాగు నీరు అందించే విషయాల్లో కూడా తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. పట్టణంలో అభివృద్ధి అనే మాట చెప్పడానికి కూడా ఏమీ లేని పరిస్థితి నెలకొంది. అలానే గిరిజన ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి పడుతున్న ఇబ్బందులు, సీతంపేటలో నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నిర్మించకపోవడం, పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడం వంటివి ఉన్నాయి. గిరిజనులు పండించిన పంటలకు కనీసం కోల్డ్‌ స్టోరేజ్‌ కూడా ఏర్పాటు చెయ్యలేదు. వీరఘట్టం మండలంలో అభివృద్ధి పనులు పడకవేశాయి. భామిని మండలంలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు పూర్తి కాకపోవడంతో అక్కడి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇన్ని సమస్యలు నియోజకవర్గంలో ఉన్నా కూడా అభ్యర్థులు కనీసం వీటిపై ఎక్కడా హామీ ఇవ్వకపోవడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.హామీని మరిచారుజంపరకోట పూర్తయ్యేదెప్పుడో..?మండలంలో కొన్ని దశాబ్దాలుగా నిలిచిపోయిన జంపరకోట ప్రాజెక్టు పనులను తమ ప్రభుత్వ హయాంలో పూర్తి చేస్తామని వైసిపి, టిడిపి ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో రైతుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో 2వేల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టు పనులు కొంతకాలంగా నిలిచిపోయాయి. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఈ ప్రాజెక్టుకు రూ.8కోట్లు నిధులు విడుదల చేశారు. అయితే నిర్వాసితుల సమస్యతో పాటు సకాలంలో ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేయకపోవడంతో ప్రాజెక్టు వ్యయం రూ.20 కోట్లకు పెరిగింది. దీంతో ప్రాజెక్టు పనులు మధ్యలోనే నిలిచి పోయాయి. 2019 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచి, తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఎల్‌ఎల్‌ పురం, గుడివాడ, కోటిపల్లి, ఓని తదితర గ్రామాల్లో రైతులకు ఎంతో మేలు జరిగి ఉండేది. ప్రాజెక్టు నిర్మాణం కాకపోవడంతో రైతులు వర్షాధారంపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు.

➡️