నేడు మాడుగుల మోదకొండమ్మ జాతర

మాడుగుల మోదకొండమ్మ విగ్రహం,

ప్రజాశక్తి-మాడుగుల

మాడుగుల మోదకొండమ్మ జాతర మహౌత్సవాన్ని ఈనెల 18న మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే అమ్మవారి జాతర మహౌత్సవానికి ఈసారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. మాడుగుల మోదకొండమ్మకు ప్రత్యేక చరిత్ర ఉంది. వందల ఏళ్ళ క్రితమే మాడుగుల ప్రాంతాన్ని పాలించిన ఒడిశా రాజులు అప్పట్లోనే అమ్మవారిని భక్తిగా కొలిచే వారని చరిత్ర చెబుతోంది. మొదట కోటలో రాజులు అమ్మవారికి పూజలు నిర్వహించేవారు. ఇక్కడి నుండి ఏజెన్సీ ప్రాంతానికి ఘటాలు తీసుకుని వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ సమయంలో సంస్థానాధీశలు ఏజెన్సీ ప్రాంతానికి చేరుకుని అమ్మవారికి పూజలు నిర్వహించి తిరిగి మాడుగుల చేరుకున్నారు. తిరిగి వచ్చే సమయంలో పూజా సామాగ్రితో పాటు బంగారు చెంబు మర్చిపోయారు. ఈ విషయాన్ని గ్రహించి ఆనాటి మంత్రిని మినుములూరు ప్రాంతానికి వెళ్లి వీటిని తీసుకురమ్మని ఆదేశించారట. మంత్రి తిరిగి అక్కడికి చేరుకున్న సమయంలో.. బంగారు చెంబు విషయమై చెప్పేసరికి అమ్మవారు ఆగ్రహంతో ఆ చెంబు తన్నగా ప్రస్తుతం మాడుగుల్లో ఉన్న దేవాలయం వద్ద పడిందని దీంతో రాజులు చిన్నపాటి గుడిని నిర్మించాలని పూర్వీకులు కథనం. కొన్నేళ్ల క్రితం మాడుగుల తహశీల్దారుగా పని చేసిన అంపన్న ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. పురాతనమైన చిన్న దేవాలయం స్థానంలో అతిపెద్ద దేవాలయం నిర్మించడానికి గ్రామస్తుల సహకారం తీసుకున్నారు. అప్పట్లో వ్యాపారుల విరాళాలతో అమ్మవారి ఆలయ నిర్మాణం చేపట్టారు. చోడవరం కి చెందిన శిల్పి ఎల్లయ్య అమ్మవారి విగ్రహాన్ని ఎంతో ఆకర్షణీంగా రూపొందించారు. శతకం పట్టు వద్ద ఏర్పాట్లు అమ్మవారి పండుగకు నెల రోజులు ముందు ఆలయం వద్ద నుండి అమ్మవారి పాదాలు, ఘటాలు ఊరేగింపుగా తీసుకొని రాజు గారి కోట ఆవరణలో ఉన్న శతకం పట్టు వద్ద కొలువు ఏర్పాటు చేశారు. నెల రోజుల పాటు అమ్మవారు కొలువు పూర్తి అయిన తర్వాత తిరిగి గ్రామ పురవీధులలో మేళ తాళాలతో ఊరేగింపుగా వెళ్లి పాదాలు ఘటాలు ఆలయం వద్ద ఉంచుతారు దీంతో పండుగ పూర్తవుతుంది.ఘనంగా అమ్మవారి సారె ఊరేగింపు మోదకొండమ్మ పండుగ సందర్భంగా గ్రామంలో పలు వీధులకు చెందిన భక్తులు అమ్మవారి సారెను ఘనంగా ఊరేగించారు. గవర వీధి, కొబ్బరి తోట వీధి, జగ్గన్న చావిడి, రాజ వీధి, మోదమాంబ కాలనీ చెందిన భక్తులు అమ్మవారికి తీర్థ ప్రసాదాలు, ఘటాలతో భారీగా ఊరేగించారు. భక్తులకు పలు సేవా కార్యక్రమాలు మోదకొండమ్మ జాతరకు వేలాదిగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో సేవా సంస్థల సహకారంతో చలివేంద్రాల ఏర్పాటు, ప్రసాద వితరణ, మజ్జిగ పంపిణీ చేస్తారు. శ్రీరామ మెడికల్‌ షాప్‌ వద్ద శ్రీనాథ్‌ రామమూర్తి ఆధ్వర్యంలో గ్లూకోజ్‌ వాటర్‌, కొట్యాడ రమేష్‌ అరుణ, కొట్యాడ కుటుంబం ఆధ్వర్యంలో ప్రసాదం, మజ్జిగ, గండి జోగినాయుడు ఆధ్వర్యంలో రెండు రోజులు కూలింగ్‌ మినరల్‌ వాటర్‌, మజ్జిగ పంపిణీ చేశారు.సాంస్కృతిక కార్యక్రమాలు పండుగ సందర్భంగా ఈ ఏడాది భారీ ఎత్తున సాంస్కృతిక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సుమారు పది రోజుల ముందు నుండే ప్రారంభమైన వినోద కార్యక్రమాల్లో భాగంగా జబర్దస్త్‌ ఫేమ్‌, రేలారే రేలారే, సాంఘిక, పౌరాణిక నాటకాలు, చిటిక భజనలు, నేల వేషాలు, ఫ్లయింగ్‌ హనుమాన్‌ వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.విద్యుత్‌ అలంకరణ అమ్మవారి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

➡️