ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై దుర్భుద్ధితోనే దుష్ప్రచారం

May 3,2024 21:47

విద్యారంగంపై బాలకృష్ణ చర్చకు సిద్ధమా?

మంతి బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ :  కేంద్ర ప్రభుత్వ సూచనతో రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుపై దుర్భుద్ధితోనే చంద్రబాబు ఎన్నికల వేళ దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం విజయ నగరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆస్తుల రక్షణ కోసం ఈ చట్టాన్ని పకడ్బందీగా రూపొందిస్తున్నామని చెప్పారు. ఈచట్టాన్ని ఇంకా అమలు చేయలేదని, ఈ అంశం కోర్టులో పరిధిలో ఉందన్నారు. ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన రీతిలోనే ఈ చట్టాన్ని అమలు చేస్తామన్నారు. కానీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రజలను గందరగోళ పరిచేందుకు చంద్రబాబునాయుడు అనసర రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. ఎన్నికలు కాబట్టి ఏది మాట్లాడితే అది చెల్లిపోతుందని, లేదంటే క్రిమినల్‌ కేసులు పెట్టాల్సి ఉంటుంది అని అన్నారు. తాజాగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో భూరిజిస్ట్రేషన్‌ ఒరిజినల్‌ పత్రాలు ఉంచుకొని, లబ్ధిదారులకు జిరాక్సు కాపీలు ఇస్తారంటూ దుష్ప్రచారం చేయడం తగదని అన్నారు. అటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవరూ చేయరని అన్నారు. జిల్లాలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో సినీనటుడు బాలకృష్ణ తనపై చేసిన ఆరోపణలను బొత్స తిప్పికొట్టారు. రాష్ట్రంలోని విద్యారంగంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, విద్యారంగ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్‌ చేశారు. సెలిబ్రెటీలు కాబట్టి ఏది మాట్లాడితే అది చెల్లిపోతుందని అనుకుంటున్నారని, విద్య గురించి తెలియకపోతే తెలుసుకోవాలని అన్నారు. పేదల కోసం బాలకృష్ణ తండ్రి ఎన్‌టిఆర్‌ గాని, బావ చంద్రబాబు గాని ఏనాడైనా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. విద్యా విధానంపై తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కోసమేనని, ప్రపంచస్థాయిలో అందరితో పోటీ పడేందుకే ఈ సంస్కరణలను తీసుకొచ్చామని తెలిపారు. 3వ తరగతి నుంచే ఇంగ్లీషులో ప్రావీణ్యం ఇప్పిస్తున్నామని చెప్పారు. డిగ్రీలో ఇంటర్న్షిప్‌ ఇచ్చి నూటికి 90శాతం మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టిడిపి దుర్మార్గులు పెట్టిన ఫిర్యాదుల వల్లే నేడు పింఛనుదార్లు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. 30 మంది చావుకు కారణమయ్యారని అన్నారు. వృద్ధులు, వికలాంగుల పాపం వారికి తప్పకుండా తగులుతుందని అన్నారు.

➡️