అత్యవసరమైతేనే బయటకు రండి

Dec 4,2023 21:07

పార్వతీపురం : మిచౌంగ్‌ తుపాను తీవ్రత దృష్ట్యా ప్రజలెవరూ మంగళ, బుధవారాలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తుఫాను తీవ్రత దృష్ట్యా జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి తుపాను తీవ్రత ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ చేపట్టామని ఆయన చెప్పారు. జిల్లాలో మనుషులు, జంతువు ప్రాణ నష్టం, పంట నష్టం జరగకుండా ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని అన్నారు. మిగ్‌ జామ్‌ తుపాను ఏర్పాట్లపై సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో 4,200 మెట్రిక్‌ టన్నుల మేర నూర్పులు జరగ్గా 629 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల వద్ద సురక్షితంగా ఉందని, మిగిలిన మొత్తం ధాన్యం యుద్ధ ప్రాతిపదికన మిల్లులకు తరలించామని చెప్పారు. ధాన్యం గానీ, ఇతర పంటలు ఎక్కడ ఉన్నా వ్యవసాయ సహాయకులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. పంట కోయకుండా ఉంటే అలాగే ఉంచాలని ఆయన సూచించారు. తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా గ్రామీణ నీటి సరఫరా విభాగం 79 జనరేటర్లు సిద్ధం చేసిందన్నారు. రహదారులపై చెట్లు, స్తంభాలు కూలితే తక్షణం తొలగించేందుకు జిల్లా విపత్తుల స్పందన శాఖ నుండి 13, రహదారులు, భవనల శాఖ నుండి 15 బృందాలు సిద్ధం చేశామని చెప్పారు. జిల్లాలోని 39 పెట్రోల్‌ బంకులు పూర్తి సామర్థ్యంతో ఉండాలని, మొబైల్‌ సేవలకు అంతరాయం కలగకుండా పవర్‌ బ్యాక్‌ అప్‌ నిర్వహించాలని మొబైల్‌ ఆపరేటర్లకు ఆదేశించినట్లు తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర సేవలకు అంతరాయం కలుగకుండా జనరేటర్లు ఇతర బ్యాక్‌ అప్‌ ఏర్పాట్లు చేశామన్నారు. 86 మంది గర్భిణులను ఇప్పటికే ఆసుపత్రులకు తరలించామనిచెప్పారు. పునరావాస కేంద్రాల వద్ద వంట ఏజెన్సీల ద్వారా ఆహార పదార్థాల తయారీకి సిద్దం చేశామని తెలిపారు. మండల స్థాయిలో తహశీల్దార్‌, ఎంపిడిఒ, ఎస్‌ఐలు సమన్వయంతో పనిచేయాలని, పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్టు తెలిపారు. విద్యుత్‌ స్తంభాలు పడిపోతే వాటిని వెంటనే పునరుద్ధరించేందుకు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు 54 జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. పారిశుధ్య నిర్వహణకు 2872 బ్లీచింగ్‌ బస్తాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. గ్రామాల్లో వాలంటీర్‌, దండోరా ద్వారా తుపాను సమాచారం తెలియజేశామన్నారు.

➡️