అనారోగ్యంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి

Feb 17,2024 19:56

మక్కువ: మండలంలోని ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సీదరపు అశోక్‌ (15) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. శనివారం స్థానిక ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్‌ పుష్పనాదం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అశోక్‌ గురువారం రాత్రి నుంచి స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. దీంతో శంబర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శుక్రవారం చికిత్స నిమిత్తం తరలించామని తెలిపారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఎనిమియాగా ఉండడంతో ఇంజక్షన్‌తో కూడిన బాటిల్‌ అశోక్‌ కిచ్చి హాస్టల్‌కు పంపించినట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి సుమారు 9.30 గంటల ప్రాంతంలో శ్వాస సంబంధిత బాధతో ఇబ్బంది పడుతుండడంతో హాస్టల్‌ వార్డెన్‌ చందర్రావు 108 సాయంతో పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. విద్యార్థి అశోక్‌ మృతదేహాన్ని శనివారం స్వస్థలమైన పాచిపెంట మండలం కారాడవలసకు తరలించినట్లు ఆయన తెలిపారు. అశోక్‌ క్లాసులో తెలివైన వాడితో పాటు మంచి సత్ప్రవర్తన కలిగి ఉండేవాడని ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ తెలిపారు. అందరితో కలిసి ఆటపాటలతో పాల్గొని రాత్రి పడుకునే సమయంలో అనారోగ్యానికి గురై అశోక్‌ తమ మధ్య లేకపోవడంతో తోటి విద్యార్థులు కన్నీళ్లు పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా సాలూరు మండలంలోని కరడవలసకు చేరుకోవడంతో తల్లిదండ్రులు సోమయ్య, రామమ్మలను ఓదార్చడం ఎవరి తరం కాకుంది. అనారోగ్యంతో మరో ఇద్దరు విద్యార్థులుఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో ప్రస్తుతం మరో ఇద్దరు విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. యు.సంజరు, జి.సంతోష్‌ కుమార్‌ ప్రస్తుతం జ్వరంతో బాధపడుతుండగా వారికి అన్ని విధాలా ఆరోగ్య సేవలందించడం జరిగిందని వార్డెన్‌ చందర్రావు తెలిపారు. ప్రస్తుతం హాస్టల్లో 260 మంది విద్యార్థులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐసీదరపు అశోక్‌ అనారోగ్యంతో మరణించడం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.పండు, సాలూరు మండల కార్యదర్శి టి.అఖిల్‌, వరుణ్‌, సునీల్‌ డిమాండ్‌ చేశారు. విద్యార్థి మృతిపై వారు శనివారం విచారణ పాఠశాలలో విచారణ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ అశోక్‌కు సరైన వైద్యమందకపోవడమే ప్రధాన కారణమన్నారు. ఈనెల 16న యాజమాన్యం శంబర పిహెచ్‌కి తీసుకెళ్లి ఆరోగ్య తనిఖీలు నిర్వహించగా, హిమోగ్లోబిన్‌ శాతం 7శాతం ఉందని తెలియజేశారని, అనంతరం అశోక్‌ను పార్వతీపురం జిల్లా హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు తెలిపారు. విద్యార్థి రెండు రోజుల నుంచి ఆరోగ్యం బాగులేనందున విద్యార్థి ప్రధాన మృతి కారణమని, అలాగే పాఠశాలలో మెడికల్‌ చెక్‌ అప్‌ నిర్వహించకపోవడమేనని అన్నారు. పోషకాహారం అందకపోవడం విద్యార్థి మృతి ప్రధాన కారణమన్నారు. ఇప్పటికే విద్యా సంస్థ ప్రారంభం నుంచి ఇప్పుడు వరకు ముగ్గురు విద్యార్థులు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేపట్టి విద్యార్థుల మృతికి కారణమైన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️