ఎపి జెఎసి ఆధ్వర్యాన ఉద్యోగుల ర్యాలీ

Feb 17,2024 19:59

సాలూరు : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి జెఎసి ఆధ్వర్యాన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు శనివారం ర్యాలీ చేపట్టారు. జెఎసి తాలూకా యూనిట్‌ చైర్మన్‌ ఎ.ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యాన ఉద్యోగులు, ఉపాద్యాయులు, విశ్రాంత ఉద్యోగులు పట్టణంలోని శ్రీరామా థియేటర్‌ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ధర్నా శిబిరాన్ని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బాలబోలు ధనుంజయరావు ప్రారంభించారు. అనంతరం స్టేట్‌ బ్యాంక్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎసి చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తే చాలనే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఉద్యోగులు దాచుకున్న పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ డబ్బులు సకాలంలో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 30శాతం ఐఆర్‌ చెల్లించాలని కోరారు. పిఆర్సీ వెంటనే ప్రకటించాలని, ఒపిఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు జిఒ 117ను రద్దు చేయాలని కోరారు. అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు ఎంవి గౌరీశంకర్‌, బాలి పద్మలత, సింగారపు సింహాచలం పాల్గొన్నారు.పాలకొండ : ఎపిజెఎసి పిలుపు మేరకు పాలకొండ డివిజన్‌ జెఎసి ఆధ్వర్యంలో ఎన్‌జిఒలు స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్‌ దగ్గర మానవహారం చేపట్టారు. అంతకుముందు తహశీల్దార్‌ కార్యాలయం నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌జిఒ గౌరవాధ్యక్షులు లిల్లీ పుష్పనాధం మాట్లాడుతూ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లయినా ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, డిఎ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ వరహాలు, డివిజన్‌ కార్యదర్శి పైల ఈశ్వరరావు ఎస్టీవో గౌరీశ్వరరావు, ఎన్జీవో నాయకులు అనూషబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️