గిరిపుత్రులు పరిహారానికి నోచుకోరా?

Feb 23,2024 21:29

ప్రజాశక్తి -సాలూరు : జిల్లాలో వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలనే డిమాండ్‌ తెరపైకి వస్తోంది. తాము నివశించే మారుమూల గిరిజన గ్రామాలకు దూరంగా ఉన్న సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి ఇప్పుడు గర్భశోకం మిగిలింది. చేతికంది వచ్చిన కూతురు లేదా కొడుకు హాస్టల్‌లో ఉంటూ అనారోగ్యంతో మృత్యువాత పడుతుంటే తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతమైంది. పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల మరణాలు గత ఏడాదిలో పెరిగాయి. ప్రధానంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎక్కువ గా విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయి. ఇంతవరకు జిల్లాలో 16మంది వరకు గిరిజన విద్యార్థులు మత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఈ మరణాలకు మూలకారణం కనుక్కుని ఆదిశగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం సంబంధిత పాఠశాలల డిప్యూటీ వార్డెన్ల సస్పెన్షన్‌తో చేతులు దులుపుకుంటోంది. మారుమూల గిరిశిఖర గ్రామాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్నారు. వీరిలో రక్తహీనత కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం పోషకాహారం అందిస్తున్నా హాస్టళ్లలో తరచూ రక్తపరీక్షలు నిర్వహించకపోవడం, వాటి నిర్వహణకు తగిన ఆరోగ్య సిబ్బంది నియమించకపోవడంతో విద్యార్ధులు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో మార్చిలో కురుపాం లో మహాత్మా జ్యోతిరావు పూలే బిసి గురుకుల పాఠశాలలో ఎం.రంజిత్‌కుమార్‌ అనే విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. అప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పుష్ప శ్రీవాణి అప్పటి ఐటిడిఎ పిఒ కూర్మనాథ్‌ ద్వారా రూ.5లక్షల పరిహారం ఆ విద్యార్థి కుటుంబానికి ఇప్పించారు. అప్పటికి ఉమ్మడి జిల్లా గా ఉన్న ఐటిడిఎ లో నిధులు పుష్కలంగా ఉన్న కారణంగా మంత్రి పుష్ప శ్రీవాణి ఒత్తిడి చేసి పరిహారం ఇప్పించారు.గిరిజన విద్యార్థుల కుటుంబాలనూ ఆదుకోవాలిగిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో చదువుతూ మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని పలు గిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఐటిడిఎ ద్వారా గాని, ప్రభుత్వం ద్వారా గాని బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలనే డిమాండ్‌ తీవ్ర మవుతోంది. గత పదేళ్లుగా జిల్లాతో పాటు రాష్ట్రంలోని గిరిజనులంతా వైసిపికి అండగా నిలుస్తున్నారు. ఈ జిల్లాలోనూ మూడు గిరిజన నియోజకవర్గాల్లో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎక్కువగా విద్యార్ధుల మరణాలు జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఎదుర్కొనున్న నేపథ్యంలో గర్భశోకంలో వున్న గిరిజన కుటుంబాలను ఆదుకోవాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుత డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్నదొర మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. జిల్లా ఆవిర్భవించిన తర్వాత పార్వతీపురం ఐటిడిఎ ఉట్టి పోయింది. నిధుల్లేని గిరిజన ఏజెన్సీగా మిగిలిపోయింది. జిల్లాగా ఏర్పడిన తర్వాత అప్పటి ఐటిడిఎ పిఒ కూర్మనాథ్‌ ఉన్న నిధులను కొత్త జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. ఐటిడిఎ కనీస అవసరాలు తీర్చడానికి కూడా నిధుల్లేకుండా ఆయన స్వామిభక్తితో ధారాదత్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మరణించిన విద్యార్ధుల కుటుంబాలను ఆదుకునే స్థితిలో ఐటిడిఎ లేకపోయి వుండొచ్చు. కానీ ప్రభుత్వం నుంచైనా నిధులు రాబట్టి విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.
ఎస్టీ కమిషన్‌ కి వినతులు
రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డివిజి శంకరరావు శుక్రవారం పాచిపెంట మండలం సరాయివలస, మక్కువ మండలం వైఎస్‌ వలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను పరిశీలించారు. విద్యార్థుల మరణాలకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను పలు గిరిజన సంఘాలు, సిపిఎం నాయకులు కలిసి వినతులు అందజేశాయి. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్వైనాయుడు, సీదరపు అప్పారావు, ఎం.శ్రీనివాసరావు కలిసి వినతిపత్రం అందజేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలపై సమగ్ర, దర్యాప్తు జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో మాదిరిగానే ఆశ్రమ పాఠశాలల్లోనూ ఎఎన్‌ఎంలను నియమించాలని కోరారు. మృతుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని కోరారు. విద్యార్థుల మృతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పి.రంజిత్‌ కుమార్‌, తాడంగి సాయిబాబు కోరారు. గిరిజన విద్యార్ధుల కుటుంబాలను ఆదుకోవాలని, రూ.5లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో గిరిజన ఆశ్రమపాఠశాలలో ఇటీవల మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని గిరిజన జెఎసి ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ శంకర్రావుకు వినతి అందజేశారు. కేంద్రీయ నవోదయ విద్యాలయాల్లో ఏర్పాటు చేసిన విధంగా ఆశ్రమం పాఠశాల విద్యార్థులకు కూడా వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని వినతిలో పేర్కొన్నారు.

➡️