జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి

Mar 23,2024 20:44

పార్వతీపురంరూరల్‌ : సిబ్బంది సమన్వయంతో కృషి చేసి జిల్లాలో జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు అన్నారు. స్థానిక ఎన్జీఓ భవనంలో ఆరోగ్య పర్యవేక్షకులు, సహాయకులకు కీటకజనిత వ్యాధుల నియంత్రణపై నిర్వహించిన రీ ఓరియంటేషన్‌ శిక్షణా కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. డాక్టర్‌ జగన్నాథరావు మాట్లాడుతూ శిక్షణలో పొందిన పరిజ్ఞానంతో క్షేత్ర స్థాయిలో కార్యాచరణ చేసి, దోమల వ్యాప్తి నియంత్రణ చర్యలు చేపడుతూ జ్వరాలు ప్రబలకుండా దృష్టి సారించాలన్నారు. సిబ్బంది ఎప్పటికప్పుడు సర్వేలియన్స్‌ చేపట్టాలని, మలేరియా, డెంగీ లక్షణాలతో ఉన్న వారిని గుర్తిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు జరిపాలన్నారు. హాస్టల్‌ విద్యార్థుల్లో జ్వరాలు గుర్తిస్తే వెంటనే చికిత్స అందజేసి పర్యవేక్షించాలన్నారు. డ్రైడే కార్యక్రమాలు పక్కగా నిర్వహించి డ్రైడే పాటించేలా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని చెప్పారు. జిల్లాలో మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో మరింతగా దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు మాట్లాడుతూ రెండు రోజుల శిక్షణలో దోమల నియంత్రణ చర్యలు, స్ప్రేయింగ్‌ పద్ధతులు, కీటక సంహారిణి రసాయనాలు వాటిని వినియోగించు విధానం, జ్వరాల లక్షణాల ద్వారా గుర్తించడం, చికిత్స, క్షేత్ర స్థాయిలో విధి నిర్వహణకు మొదలగు అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించి సిబ్బందికి పరిజ్ఞానాన్ని పెంపొందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌బిఎస్‌కె ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రఘుకుమార్‌, ఎపిడిమియాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీధర్‌, ఎఎంఒ సూర్యనారాయణ, జిల్లా విబిడి కన్సల్టెంట్‌ రామచంద్రరావు, ఇఒ నాగేంద్ర, సబ్‌ యూనిట్‌ అధికారులు, మలేరియా టెక్నికల్‌ సూపర్‌ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️