నేటి గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలి

Feb 15,2024 19:59

పార్వతీపురం టౌన్‌ :ఈనెల 16న జరిగే గ్రామీణ బంద్‌, పట్టణ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు, రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో సిఐటియు, రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం జరగబోయే గ్రామీణ బంద్‌, పట్టణ సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు పంచుతూ ప్రచారం చేస్తూ మాట్లాడారు. స్థానిక పాతబస్టాండు మార్కెట్‌ యార్డ్‌ వివిధ కేంద్రాల్లో ఆటో ద్వారా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బంటు దాసు మాట్లాడుతూ రైతులు, కార్మికులు, ఉద్యోగులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని వాటికి నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ బందును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, నాయకులు బి. సూరిబాబు, పి. రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.కురుపాం : కేంద్రప్రభుత్వం గిరిజన, రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు, రాష్ట్రానికి చేసిన ద్రోహానికి నిరసనగా అన్ని ప్రజా సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా శుక్రవారం తలపెట్టిన బంద్‌ను, ర్యాలీ, నిరసన సభల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కిసాన్‌ మోర్చా కార్మిక సంఘాల నాయకులు కోరాడ ఈశ్వరరావు కోరారు. దేశవ్యాప్తంగా సమ్మె సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు బిడ్డికి వాసుదేవరావు, బి.అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో భారామని, సవరగూడ, ఎర్రగుడ్డి, గుంజరాడ మొండెంఖల్‌ గ్రామాల్లో సమ్మె విజయవంతం చేయాలని ప్రచారం నిర్వహించారు.కొమరాడ : దేశ వ్యాప్తంగా శుక్రవారం జరుగు గ్రామీణ భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు. బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని సీసాడవలసలో ప్రచారం నిర్వహించారు. గ్రామీణ బంద్‌లో కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాలకొండ : గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని వెలగవాడలో వ్యవసాయ కార్మికసంఘం నాయకులు దూసి దుర్గారావు ప్రచారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా గురువారం జరుగు గ్రామీణ భారత్‌ బంద్‌లో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

➡️