నేడు పోలమాంబ సిరిమానోత్సవం

Jan 22,2024 21:15

మక్కువ: రాష్ట్ర గిరిజన దేవత జాతరగా గుర్తింపు పొందిన ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శంబర పోలమాంబ అమ్మవారి సినిమానోత్సవం మంగళవారం జరగనుంది. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమయ్యే సినిమానోత్సవానికి ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పర్యవేక్షణలో సుమారు 650 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఇఒ వివి సూర్యనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. సాలూరు, పార్వతీపురం, విజయనగరం, పాలకొండ ఆర్‌టిసి డిపోల నుంచి సుమారు 170 బస్సులు ప్రత్యేకంగా శంబరకు నడపనుంది. ఇందుకోసం వనంగుడి వద్ద సాలూరు వైపు నుండే వచ్చేబస్సులను అలాగే జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ వద్ద మక్కువ వైపు నుండి వచ్చే బస్సులను నిలపనున్నారు.నిఘా నీడలో సంబరజాతర సందర్భంగా మంగళవారం జరగనున్న సినిమానోత్సవానికి పటిష్ట నిఘాను ఏర్పాటు చేసినట్లు ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో తమ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. డ్రోన్‌, సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. అసాంఘిక శక్తులకు, అల్లర్లకు ఎలాంటి ఆస్కారం లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. క్రైమ్‌ టీం, షీ టీంలతో పాటు మఫ్టీలో మహిళా, పురుష పోలీసులు విధులు నిర్వహిస్తారన్నారు. రహదారి భద్రతపై పటిష్ట చర్యలు చేపట్టమన్నారు. మక్కువ ప్రధాన రహదారి జంక్షన్‌ నుంచి ట్రాఫిక్‌ను రెండు విధాలా మళ్లిస్తున్నట్టు తెలిపారు. చెముడు మీదుగా మూడు, నాలుగు చక్రాల వాహనాలకు అనుమతిస్తూ,కవిరపల్లి మీదుగా ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. సిరిమాను ఊరేగింపు సమయంలో రోప్‌ పార్టీ బందోబస్తు ఉంటుందన్నారు. మూడుచోట్ల ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేశామన్నారు. అపరిచిత వ్యక్తులతో భక్తులు ఎటువంటి చనువుతో ఉండకూడదన్నారు. ఎలాంటి ఇబ్బంది కలిగినా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించాలన్నారువిద్యుత్‌ శాఖ ఏర్పాట్లు భేష్‌జాతర సందర్భంగా గ్రామంలోని అమ్మవారి ఆలయాల వద్ద ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరాకు ఆ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. డిఇ వి.కిషోర్‌, ఎడిఎ రంగారావు ఆధ్వర్యంలో లైన్‌ ఇన్స్పెక్టర్‌ ఎ.రవికుమార్‌, లైన్‌మాన్లు ఎల్‌.శ్రీనివాసరావు, సురేష్‌, ఇతర సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తూ విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అలాగే గ్రామంలో సిరిమాను తిరిగాడే వీధుల్లో విద్యుత్‌ తీగలను ఏమాత్రం వదులు లేకుండా చర్యలు చేపట్టారు.విధుల్లో120 మంది పారిశుధ్య కార్మికులుగ్రామంలో పూర్తిస్థాయిలో పారిశుధ్య పనులు చేపట్టేందుకు 120మంది పారిశుధ్య కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఇఒపిఆర్‌డి దేవకుమార్‌ తెలిపారు. సోమ, మంగళ, బుధవారాల్లో సేవలు వినియోగిస్తున్నామన్నారు. అలాగే అన్ని సచివాలయాల కార్యదర్శులు కూడా జాతర పనుల్లో నిమగమై ఉన్నారన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా స్వచ్ఛ శంబర పాటిస్తామని ఆయన తెలిపారు.

➡️